యువ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్భాషలాడాడు. సుమన్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిండు సభలో కేసీఆర్ ‘పాగల్’ అంటూ చిందులు తొక్కారు. అది కూడా తెలంగాణలో కాదు మహారాష్ట్రలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ శాసనసభ్యుడిని పట్టుకుని ‘పాగల్’ అనడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంట్లో పనోడి మాదిరి సీఎం కేసీఆర్ ఇంట్లో బాల్క సుమన్ మారాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దళిత ఒక ఎమ్మెల్యేను పట్టుకుని తిట్టడంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఇంతకి అసలేం జరిగింది అంటే.. నాందేడ్ లో ఆదివారం బహిరంగ సభ అనంతరం స్థానిక మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ఆరు సెట్ల పత్రాలు అందించారు. అయితే ఈ పత్రాలు ఇవ్వడంలో తాత్సారం జరిగింది. పలుమార్లు బాల్క సుమన్ ను తొందరగా ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించాడు. అయినా కూడా ఆలస్యమవుతుండడంతో ‘సుమన్ ఆ పేపర్లు వాళ్లకు ఇవ్వాలి. ఇక్కడికెళ్లి ఇచ్చుకుంటూ పోవయ్యా. ఇక్కడికెళ్లి రా. నీకు ప్రియారిటీ లేదు. అరే పాగల్ ఇటు నుంచి ఇచ్చుకుంటూ వెళ్లు అందరికీ’ అని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత ‘ఏయ్ సుమన్’ అంటూ మరోసారి తీవ్ర స్వరంతో కేసీఆర్ సుమన్ ను పిలిచారు.
ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఒక దళిత ఎమ్మెల్యేను పట్టుకుని ‘పాగల్’ అంటూ కేసీఆర్ అనడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రజల ప్రతినిధిపై కేసీఆర్ అహంకార ధోరణితో దాడి చేస్తున్నాడని దళిత నాయకులు మండిపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను పట్టుకుని సీఎం కేసీఆర్ ‘పాగల్’ అని దుర్భాషలాడడం దారుణమని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేను ఇష్టమొచ్చిన తీరునా పిలవడం కేసీఆర్ కు దళితులపై ఉన్న ప్రేమ ఏమిటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. దళిత ఎమ్మెల్యేను అగౌరవించడంపై దళిత నాయకులు ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో బాల్క సుమన్ కీలక పాత్ర పోషించాడు. ఓయూ జేఏసీలో, బీఆర్ఎస్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా సుమన్ పని చేశాడు. ఉద్యమంలో సుమన్ పాత్రను గుర్తించి కేసీఆర్ 2014లో పెద్దపల్లి టికెట్ ఇవ్వగా.. సుమన్ ఎంపీగా విజయం సాధించాడు. అనంతరం 2018లో చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడు. నిరంతరం కేసీఆర్, కేటీఆర్ వెన్నంటి ఉండే వ్యక్తి సుమన్. నాందేడ్ సభ విజయవంతం కావడంలో సుమన్ ఎంతో శ్రమ దాగి ఉంది.