వయసు మీద పడడం.. ప్రస్తుత జుగుప్సకర రాజకీయాలు వంటి వాటితో ఆ సీనియర్ నాయకుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నిలిచి గెలవాలి కానీ.. డబ్బులతో రాజకీయం చేయడం మాజీ ముఖ్యమంత్రికి నచ్చడం లేదు. ప్రస్తుత రాజకీయాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన రాజకీయాలకు త్వరలో గుడ్ బై చెప్పనున్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారి పోటీ చేసి అనంతరం ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమవుతానని ప్రకటించారు. ఆయనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య తెలిపారు.
రెండు నెలల్లో కర్ణాటకలోని 224 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పుడు జరుగనున్న ఎన్నికలే తన చివరివని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఓడినా.. గెలిచినా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. అంటే ఎన్నికల అనంతరం కూడా రాజకీయాల్లో కూడా కొనసాగుతానని ప్రకటించారు. 2013-2018 మధ్య సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన బీజేపీ అధికారం చేజిక్కించుకుంది.