ప్రపంచంలో ఇంత దుర్మార్గమైన ప్రధాని లేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం ప్రధాని మోదీ పైన ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశ ప్రజల చూపు తెలంగాణ వైపు ఉన్నదని, ప్రభుత్వం అంటే రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని ఎద్దేవా చేశారు. నాయకులు విజన్ ప్రకారం పని చేయాలన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు, ఆర్థికవేత్త లేరన్నారు. నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరని నిలదీశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తామన్నారు. మేము రైతు రాజ్యం కావాలంటే, బీజేపీ వాళ్లు కార్పొరేట్ రాజ్యం కావాలని అంటున్నారని విమర్శించారు. గుజరాత్లో పవర్ హాలీడేలు ప్రకటిస్తుంటే.. ఇక్కడ అలా లేదన్నారు.
ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల, అటువెళ్లాక పూర్తిగా మారిపోయారు. తెలంగాణ పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయన్నారు. నాబార్డు, ఎఫ్‌సీఐ నివేదికలను కూడా నమ్మకంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందన్నారు. ప్రతిపక్షాలు సద్విమర్శలు చేయవచ్చునని, కానీ రాష్ట్రాన్ని కించపరచవద్దని సూచించారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో మనం పోటీ పడుతున్నామన్నారు. యూఎన్వో కూడా రైతుబంధును ప్రశంసించిందని గుర్తు చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్‌వన్‌గా ఉన్నామన్నారు.