కర్మ ఫలం అంటే ఇదే కావచ్చు. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అన్నట్టుగా ఒక యువకుడు తన ఫ్రెండ్‌ను చంపి అతడి బాడీని లోయలో పడేయబోయి కాలు జారి తనే లోయలో పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంబోలి ఘాట్‌లో చోటు చేసుకుంది. సతారా జిల్లా కరాడ్‌కు చెందిన బౌసో మనే అనే వ్యక్తి ఆర్థిక వ్యవహారాల్లో గొడవలు రావడంతో తన ఫ్రెండ్ సుశాంత్ ఖిల్లరే అనే వ్యక్తిని హత్య చేశాడు.
ఆ తర్వాత పోలీసులకు దొరకకూడదని.. ఆ బాడీని డిస్పోజ్ చేద్దామనుకున్నాడు. మరో ఫ్రెండ్ తుషార్ పవార్ సాయం తీసుకొని ఆ బాడీని కరాడ్ నుంచి 400 కిమీ దూరం ఉన్న అంబోలి ఘాట్‌కు కారులో తీసుకెళ్లారు. అక్కడ కొండ మీది నుంచి లోయలోకి ఆ బాడీని విసిరేయబోయాడు. కానీ.. మనే కాలు జారింది. దీంతో బాడీతో పాటు తను కూడా లోయలో పడి చనిపోయాడు. మనేతో పాటు వచ్చిన తుషార్.. అతడు కూడా అందులో పడి చనిపోవడం చూసి భయపడి అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లోయలోకి దిగి ఇద్దరి బాడీలను రికవరీ చేశారు. కొండ నుంచి 10 ఫీట్ల లోతులో ఇద్దరి బాడీలు దొరికాయని మీడియాకు తెలిపారు.
అంబోలీ ఘాట్ అనేది డేంజర్ ఘాట్. రోడ్డుకు ఇరువైపుల ఉండే ఈ ఘాట్ రోడ్డు అత్యంత ప్రమాదకరమైనది. ఇదివరకు చాలాసార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయారు. కొన్నేళ్ల కింద ఇద్దరు ట్రావెలర్స్ కూడా లోయలో పడి చనిపోయారు. వాళ్ల బాడీల జాడ కూడా తెలియలేదు.