Air India : 25 మంది ఉద్యోగుల్ని తొలగించిన ఎయిర్ ఇండియా
ఉన్నట్లుండి అనారోగ్యంగా ఉందంటూ సెలవులు పెట్టిన 25 మందిని ఎయిర్ ఇండియా తొలగించింది. మిగిలిన వారు గురువారం లోగా విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Air India Cabin Crew Terminate : ఉద్యోగులకు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు మధ్య మొదలైన వివాదం కాస్తా ముదురుతున్నట్లు కనిపిస్తోంది. సంస్థ విధానాల పట్ల అసంతృప్తితో ఉన్న సిబ్బంది ఒక్కసారే సెలవులు పెట్టారు. దాదాపుగా 200 మంది క్యాబిన్ క్రూ(CABIN CREW) ఆరోగ్యం బాలేదనే కారణం చూపి విధులకు రావడం మానేశారు. దీంతో సంస్థ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే 25 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. మిగిలిన వారు గురువారం సాయంత్రం నాలుగు గంటల లోగా విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. లేని పక్షంలో వారిని సైతం ఉద్యోగాల నుంచి తీసి వేస్తామని హెచ్చరించింది.
ఇలా ఉద్యోగులంతా మూకుమ్మడిగా ఒక్కసారిగా సెలవులు పెట్టడంతో ఎయిర్ ఇండియా దాదాపు వందకు పైగా విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ఈ కారణంగా దాదాపు 15 వేల మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా రద్దైన ఫ్లైట్ల వల్ల ఇబ్బందులు పడిన వారందరికీ రిఫండ్ చేస్తామని లేదంటే మరో విమానంలో ప్రయాణ టికెట్ ఇస్తామని సంస్థ తెలుపుతోంది. అయితే ఇలా వరుసగా విమానాల రద్దు అవుతుండటంతో ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ సైతం స్పందించింది. దీనిపై ఎయిర్ ఇండియాను (AIR INDIA) వివరణ కోరింది.