»Air India Express Crisis Resolved Cabin Crew To Return To Work Airline Cancels Sackings
Air India : ఎయిర్ ఇండియా సిబ్బంది సమ్మె విరమణ.. తీసేసిన ఉద్యోగులూ విధుల్లోకి
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, సిబ్బందికి మధ్య తలెత్తిన సమ్మె గొడవ కాస్త సద్దుమణుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
Air India Express Employees Strike : ఎయిర్ ఇండియా ఉద్యోగులు శాంతించారు. సమ్మె విరమించి విధుల్లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. తమ జీతాలు, సమానత్వం విషయంలో అనుసరిస్తున్న సంస్థాగత విధానాల విషయంలో సిబ్బంది అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు అనారోగ్య కారణాలు చెప్పి దాదాపుగా 300 మంది ఉద్యోగులు ఒక్కసారిగా విధులకు హాజరుకావడం మానేశారు. దీంతో సంస్థ 25 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తప్పించింది. మిగిలిన వారంతా గురువారం సాయంత్రం లోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(Air India Express) అల్టిమేటం జారీ చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ సిబ్బంది సమ్మె విరమించి తిరిగి విధుల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వీరంతా ఇలా సామూహికంగా సెలవులు పెట్టడంతో పదుల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఫలితంగా దేశ, విదేశీ ప్రయాణికులు సైతం అసౌకర్యానికి గురయ్యారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎయిర్ ఇండియా(Air India) గురువారం ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్‌తో ఉద్యోగులు దిగొచ్చారు. దీంతో తీసేసిన 25 మందిని కూడా తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకుంటాని సంస్థ తెలిపింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో(Air India Express), ఏఐక్స్ కనెక్ట్‌తో విలీనం అప్పటి నుంచి ఎయిర్ ఇండియాలో కొంత మంది చాలా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో మంగళవారం నుంచి అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. దాదాపుగా 300 మంది వరకు క్యాబిన్ క్రూ సిబ్బంది ఒక్కసారిగా సిక్ లీవ్‌లకు అప్లై చేశారు. కొత్త ఒప్పందంలో భాగంగా తమకు తక్కువ వేతనం అందుతుందని ఆందోళన బాట పట్టారు. దీంతో ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుని చివరికి గొడవ సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి.