తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో మలుపులు తిరిగిన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజాకవి, స్వాత్రంత్య సమరయోధుడు కాళోజీ నారాయణ రావు చెప్పిన ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అనే పంక్తులను ఉటంకిస్తూ గవర్నర్ ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రసంగంలో గవర్నర్ పేర్కొన్నారు. అన్ని రంగాలవారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను వివరిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు దాదాపు రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు నెలలు నిర్వహించాలని డిమాండ్ చేస్తుండగా.. బీజేపీ మాత్రం మరికొన్నాళ్లు నిర్వహించాలని కోరుతున్నది. సమావేశాల నిర్వహణపై బీఎసీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. అయితే సచివాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం పది రోజుల పాటు సభా సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు
– సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందు ఉంది.
– తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
– వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించాం.
– కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశాం.
– రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
– ఇప్పటివరకు రూ.65 వేల కోట్లు రైతులకు అందించాం.
– 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.
– నీటి కోసం గతంలో గొడవలు జరిగాయి.. ఇప్పుడు 24 గంటల పాటు నీటి సరఫరా.
– రాష్ట్ర జీఎస్డీపీలో 18.2 శాతం వ్యవసాయ రంగం నుంచే సమకూరుతున్నది.
– తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
– దళితబంధు విప్లవాత్మకమైన పథకం. ప్రతి దళితుడికి రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నాం.
– పేదలకు చేయూతగా ఆసరా పథకం. పింఛన్ దారుల వయసు 57కు తగ్గించాం.
– ఎస్టీ రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచాం
– రూ.11 వేల కోట్ల 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ.
– మాంసం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉంది.
– బతుకమ్మ చీరలతో చేనేతలకు ఉపాధి
– నేతన్న బీమా పథకం తీసుకొచ్చాం. నేత కార్మికులకు రూ.5 లక్షల బీమా పథకం ఇవ్వనున్నాం.
– పోలీస్ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్