Coconut Water : వీరు మాత్రం కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగితే ప్రమాదమే!
వేసవి కాలంలో మన దాహం తీర్చే సహజమైన రిఫ్రెషింగ్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. అయితే కొందరు మాత్రం వీటిని ఎక్కువ తాగితే ప్రమాదమే అని వైద్యులు అంటున్నారు. ఎవరంటే..?
Coconut Water : ఎండలు ముదిరిపోతున్నాయి. వడగాల్పులుగా మారిపోతున్నాయి. ఇలాంటి వేసవి కాలంలో మనం అంతా కొబ్బరి బొండం నీళ్లు, చెరుకు రసం వంటి సహజమైన పానీయాలను తాగుతూ ఉంటాం. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా మంచిదే. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం వీటిని ఎక్కువగా తాగకూడదు. ఎవరెవరు తాగకూడదు? తాగితే ఏం అవుతుంది? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం ఉన్న వారు కొబ్బరి నీటిని( Coconut Water )ఎక్కువగా తాగకూడదు. వీటిలో సహజమైన చక్కెరలైన సుక్రోజ్, గ్లూకోజ్ లాంటివి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్ని వేగంగా పెంచే సామర్థ్యం కలిగి ఉంటాయి. ప్యాక్ చేసి బాటిళ్లలో ఉండే కొబ్బరి నీటిలోనూ చక్కెరలు ఎక్కువగానే ఉంటాయి. అందుకనే డయాబెటీస్ ఉన్న వారు వీటిని ఎక్కువగా తాగకుండా ఉండటమే మంచిది.
లో బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్న వారు కూడా కొబ్బరి నీటిని( Coconut Water ) ఎక్కువగా తాగకూడదు. తక్కువ బీపీ ఉన్న వారు వీటిని తాగితే మరింత లోబీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్న వారికి కొబ్బరి నీటిని తాగడం వల్ల ఆ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది ఈ సమస్యలను మరింత పెంచుతుంది. అందుకనే వీరంతా మోతాదుకు మించి అధికంగా వీటిని తాగే ప్రయత్నం చేయకూడదు. అలాగే రోజూ ఎక్కువగా కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరంలో పొటాషియం పెరిగి పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొబ్బరిలో ట్రోపోమియోసిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది కొంత మందికి అలర్జిక్గా ఉంటుంది. ఈ అలర్జీ ఉంటే ముఖం, నాలుక, పెదవులు దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి తలెత్తే ప్రమాదం ఉంటుంది.