Killer : ప్రియురాలిని చంపి అల్మరాలో కుక్కిన ప్రియుడు!
ప్రియురాలితో నెలన్నరగా లివిన్ రిలేషన్షిప్లో ఉన్న ఓ వ్యక్తి తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి అల్మరాలో కుక్కేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Lover Killed His Girlfriend : నెలన్నరగా ప్రియురాలితో సహజీవనం చేసి తర్వాత ఆమెను దారుణంగా చంపేశాడో ప్రియుడు. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌కు చెందిన యువతి(26)తో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విపుల్ టైలర్ నెలన్నరగా సహజీవనం(Live In Relationship) సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. యువతిపై కోపం పెంచుకున్న అతడు ఆమెపై తొలుత దాడికి దిగాడు. ఈ విషయాన్ని యువతి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. తర్వాత ఆమెను అతడు దారుణంగా హత్య చేశాడు.
బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు ఈ విషయమై దిల్లీలోని దబ్రీ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రేమికులు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. తనిఖీల్లో భాగంగా ఇంటి అల్మరాని తెరిచి చూడగా అందులో ఆమె మృత దేహం లభించింది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. దీంతో విపుల్ టైలర్ ప్రేయసిని తీవ్రంగా కొట్టి చంపేసి ఉంటాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తర్వాత మృత దేహాన్ని అల్మరాలో కుక్కు పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు.
పోలీసులు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ఫ్లాట్లలో ఉండే వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిద్దరూ తరచుగా గొడవలు పడుతూ ఉండేవారని, బుధవారం రాత్రి కూడా అలాగే పెద్ద గొడవ జరిగిందని వారు తెలిపారు. ఈ ఘటనపై ఐపీసీలోని సెక్షన్ 302 కింద మర్డర్ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న విపుల్ టైలర్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ(CCTV) ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.