వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. అంతకుముందు అరుణ్ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిర్మల పార్లమెంట్‌కు బడ్జెట్ సమర్పిస్తున్నారు. అరుణ్ జైట్లీ సూచన మేరకే నిర్మలకు ప్రధాని మోడీ బాధ్యతలు అప్పగించారట. నిర్మలా సీతారామన్ పుట్టినిల్లు తమిళనాడు కాగా.. మెట్టినిట్టు ఆంధ్రప్రదేశ్.
ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్
ఎన్డీఏ సర్కార్ 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఆర్థిక మంత్రి బాధ్యతలను అరుణ్ జైట్లీ స్వీకరించారు. 2014-15 నుంచి 2018-19 వరకు ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి చివరి రోజు నుంచి నెల ఆరంభానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు. 2019-20 మధ్యంతర బడ్జెట్ సమయంలో జైట్లీ ఆరోగ్యం బాగేలేదు. పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారుఆ బడ్జెట్‌ను ఆయన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
ఎరుపు రంగు సంచి
రెండోసారి మోడీ సర్కార్ అధికారం చేపట్టింది. నిర్మలా సీతారామన్‌కు ఆర్థికశాఖ బాధ్యతలను మోడీ అప్పగించారు. కరోనా సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చారు. సంప్రదాయంగా వస్తున్న బ్రీఫ్‌కేస్ విధానాన్ని పక్కనపెట్టి ‘బాహీ- ఖాతా’గా పిలిచే వస్త్రంతో కూడిన ఎరుపు రంగు సంచిలో బడ్జెట్‌ను పార్లమెంటుకు తీసుకొచ్చే ఆనవాయితీని ప్రారంభించారు.
చిదంబరం
కాంగ్రెస్ హయాంలో పీ చిదంబరం ఆర్థికమంత్రిగా విధులు నిర్వహించారు. 2004-05 నుంచి 2008-09 వరకు వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
మారిన సమయం
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రి పదవీని యశ్వంత్ సిన్హా చేపట్టారు. 1998-99 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1999-2000 నుంచి 2002-03 వరకు వరుసగా నాలుగుసార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుంచారు. ఇతని హయాంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు.
ఆర్థిక సంస్కరణలు
పీ.వీ. నరసింహారావు హయాంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991-92 నుంచి 1995-96 వరకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక సంస్కరణలతో కూడిన 1991-92 బడ్జెట్ దేశ గతిని మార్చింది. రుపాయి విలువ పడిపోకుండా పీవీ, మన్మోహన్ కాపాడారు.
10 సార్లు బడ్జెట్
దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ నిలిచారు. 10 సార్లు ఆయన పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టారు. 1959-60 నుంచి 1963-64 మధ్య వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందు ఉంచారు.