Hyderabad: తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మోదీ దర్శించుకున్నారు. ఆలయం దగ్గరకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. శాలువాతో ప్రధానిని సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి, వేద ఆశీర్వదం అందజేశారు. ప్రధానితో పాటు ముఖ్యులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు.
ముందుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో సంగారెడ్డి చేరుకోనున్నారు. అక్కడ రూ.9 వేల 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్గా చేయబోతున్నారు. రూ.1409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు రూ.1298 కోట్ల రూపాయలతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పర్యటన కోసం నిన్న ప్రధాని ప్రత్యేక ఏర్పాట్లు మధ్య రాజ్ భవన్లో బస చేశారు.