»Vinod Kumar Said That Brs Will Win The Parliamentary Elections
Vinod kumar : బండి సంజయ్ పార్టీకే పనిచేశాడు.. ఏనాడు ప్రజల కోసం పనిచేయలేదు
బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి ఐదేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు తన పార్టీ బీజేపీ కోసం మాత్రమే పనిచేశాడు తప్పితే ఏనాడైనా ప్రజల కోసం పని చేశాడా అని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Vinod kumar : బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి ఐదేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు తన పార్టీ బీజేపీ కోసం మాత్రమే పనిచేశాడు తప్పితే ఏనాడైనా ప్రజల కోసం పని చేశాడా అని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికలు వస్తేనే బండి సంజయ్ కి ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి మళ్లీ ఎంపీ ఎన్నికలకు ఎందుకు వస్తున్నాడని…బండి సంజయ్ కి ఎంపీ పదవి ఏమన్నా పునరావాస కేంద్రమా అని వినోద్ ప్రశ్నించారు. వేములవాడ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఐదు రూపాయలు కూడా నిధులు తీసుకురాలేదని పేర్కొన్నారు.
2004లో ఐదుగురు ఎంపీలు గెలిచి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ లో తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ తో కలిసి గళమెత్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. 2006లో తెలంగాణ ఇస్తామని అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని, 2009లో మళ్లీ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 2014లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత రోజుకు 18 గంటలు పని చేశారని…కేవలం మూడున్నరేళ్ల కాలంలోనే కృష్ణ, గోదావరి నదులపై పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టామన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచే ప్రసక్తే లేదని, బలమైన ప్రతిపక్షంగా నిలబడి అధికారపక్షంపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. కేంద్రంలో పదేళ్ల కాలంగా ప్రధానిగా నరేంద్రమోడీ ఉన్నారని 2014 నుంచి 2019 వరకు తాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ తో చర్చించి కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం వెయ్యి కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దానన్నారు. మానేరు రివర్ ప్రంట్ తో పాటు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ రహాదారుల కోసం పార్లమెంట్ లో కొట్లాడి కరీంనగర్ చుట్టుపక్కల నాలుగు జాతీయ రహాదారులను నిర్మాణం చేయించడం జరిగిందన్నారు.
2004లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు రైల్వేలైన్ కావాలని ఆడిగి మంజూరు చేయించామన్నారు. 2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా గెలిచిన తర్వాత రైల్వే ప్రాజెక్టు ను పట్టించుకోలేదన్నారు. 2014లో తాను కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత మళ్లీ కరీంనగర్ రైల్వే ప్రాజెక్టు పట్టాలెక్కిందని పేర్కొన్నారు. ఓట్లు దండుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి…అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నాను. అధికారంలోకి రాగానే రైతు ఋణమాఫీ చేస్తామని అన్నారు..ఇప్పటి వరకు రుణమాఫీ పై ఏ ప్రకటన చేయలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్ల పేరుతో ఈ యాసంగి సీజన్ లో ప్రాజెక్టు లను ఎండబెట్టే కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యాసంగి పంటలకు సాగునీళ్లు ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలని అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని…కానీ తెలంగాణా రాష్ట్రం వచ్చే నాటికి 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేదని, ఇప్పుడు 26 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ యాసంగి వరి పంట ఎఫ్రీల్, మే మాసాల్లో కోతలకు వస్తుందని…ఎన్నికల సమయంలో క్వింటాలుకు రూ.500ల బోనస్ ఇస్తామని చెప్పారని.. ప్రభుత్వం రైతులకు బోనస్ ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తీర్పును శిరసావహిస్తామని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగరాలని, కార్యకర్తలందరూ సైనికుల్లా పని చేయాలని అన్నారు.