Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికీ ఏడుసార్లు ఈడీ నోటీసులు జారీ చేసిన కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఇలా కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇవ్వడం ఇది ఎనిమిదోసారి. ఏడోసారి ఇచ్చిన నోటీసుల గడువు ముగిసిన తర్వాతి రోజే మరోసారి సమన్లు జారీ చేశారు. మార్చి 4న విచారణకు రావాలని పేర్కొంది.
కేజ్రీవాల్ వరుసగా విచారణకు గైర్హాజరవుతుండటంతో దర్యాఫ్తు సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తనను కోర్టు ఆదేశిస్తేనే విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ నిన్న తేల్చి చెప్పారు. తమను ఇండియా కూటమి నుంచి నిష్క్రమింప చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమపై విచారణ పేరుతో ఒత్తిడి చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.