సాధారణంగా మనుషులకు మాత్రమే పెళ్లిళ్లు జరగకుండా కుక్కలు, గాడిదలు వంటి జంతువులకు కూడా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. అయితే ఓ కేరళలోని కోజికోడ్ జిల్లాలో కొడియత్తూరు గ్రామస్థులు దీనికి భిన్నంగా రోడ్డుకు పెళ్లి చేశారు. అసలు రోడ్డుకి పెళ్లి చేయడం ఏంటి? ఎందుకు చేశారో? వివరాల్లో తెలుసుకుందాం.
Kerala: కొడియాత్తూరులో 1980లో 1200 మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పుతో రోడ్డును నిర్మించారు. ఆ తర్వాత గ్రామ జనాభా 3 రెట్లు పెరిగింది. వాహన రాకపోకలు కూడా భారీగా పెరిగాయి. గుంతలు పడిన రోడ్డుకు మరమ్మతులు చేయడం, రోడ్డు విస్తరణ పనులు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితూ భూసేకరణ చేస్తే కొన్ని కుటుంబాలు భూమిని కోల్పోతాయని గుర్తించారు. ఇలాంటి వాళ్లకి పరిహారం, రహదారి నిర్మాణానికి రూ.60 లక్షలు అవుతుందని అంచనా వేశారు.
ఈ నిధుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టాలని నిర్ణయించారు. అయితే గ్రామంలోని కొందరు రూ.లక్ష చొప్పున విరాళం ఇచ్చారు. కానీ ఇంకా రూ.45 లక్షలు అవసరం కావడంతో అప్పుడు వాళ్లకు పనం పయట్టు, కురికళ్యాణం గుర్తువచ్చింది. ఇది ఉత్తర కేరళలో సంప్రదాయ దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థ. ఈ పేరుతో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి నిధులను పోగు చేస్తారు. ఇది 90వ దశకంలో రుణాలు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల ప్రాముఖ్యత కోల్పోయిన సంప్రదాయాన్ని మళ్లీ ఇప్పుడు రోడ్డు విస్తరణ ప్రాజెక్టు నిధుల కోసం గ్రామస్థులు తెరపైకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పనం పయట్టు కింద రహదారికి పెళ్లిచేశారు.