ఓ పెళ్లిలో ఊహించని ట్వీస్ట్ చోటు చేసుకుంది. వధువు పెళ్లి అంతకుముందు నిశ్చయించిన వరుడితో జరుగలేదు. అతడి తమ్ముడితో వధువుకు వివాహం జరిగింది. ఏంటి షాక్ అయ్యారా. కానీ, ఇది నిజం. అసలేం జరిగిందంటే.. ఫేషియల్ కు వెళ్లిన వరుడు పరారీ కావడంతో.. వధువుకు అతడి తమ్ముడితో పెళ్లి చేసేశారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బరేలీకి చెందిన తిలక్ అనే వ్యక్తికి పెళ్లి ఖాయమైంది. అయితే, అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయాన్ని అతడు ఇంట్లో చెప్పలేదు. దాంతో వాళ్లు ముహూర్తాలు పెట్టేశారు. సరిగ్గా తాళి కట్టే సమయానికి వరుడు.. ఫేషియల్ చేయించుకునేందుకు బయటకు వెళ్లాడు.
అంతే, ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో అతడు పరార్ అయ్యాడు. కాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు పరార్ అని తెలిసి అంతా షాక్ అయ్యారు. వరుడు, వధువు కుటుంబసభ్యులు అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. పెళ్లి కొడుకు తిరిగి వస్తాడేమో అని వాళ్లు చాలా సేపు ఎదురుచూశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అతడు తిరిగి రాలేదు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన వారు మాట్లాడుకున్నారు.
ఏం చేయాలా అని చర్చించారు. ఆ తర్వాత ఇరువురూ ఓ నిర్ణయానికి వచ్చారు. వరుడు తిలక్ తమ్ముడికి వధువుని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీనికి అందరూ ఆమోదం తెలిపారు. అంతే, కేవలం రెండు గంటల్లోనే పెళ్లి చేశారు. చివరి నిమిషంలో వరుడు జంప్ అయినా పెళ్లి ఆగలేదు. దీంతో వధువు కుటుంబసభ్యులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాగా, ఈ పెళ్లి వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది.