ఆంగ్ల భాషలో మాట్లాడితే ఫైన్ పడుద్ది. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇటలీ(italy)లో కొత్తగా ఇంగ్లీష్(English) భాషను వినియోగించడాన్ని నిషేధించారు. ఒక వేళ ఉపయోగిస్తే వారికి 100,000 యూరోల (రూ.82,46,550)ఫైన్ విధించనున్నారు.
ప్రస్తుత కాలంలో ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా కూడా ఇంగ్లీష్ భాష(english language) తప్పనిసరిగా మారింది. మరోవైపు అనేక సాఫ్ట్ వేర్స్(softwares) సహా సాధారణంగా పలు కంపెనీలలో ఆంగ్ల భాషను మాట్లాడేందుకు విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ ఓ దేశంలో మాత్రం ఆంగ్ల భాష వాడకాన్ని నిషేధించారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
ఇటలీ(italy)లో ఈ మేరకు ఆంగ్ల భాషను ఉపయోగించకుండా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ ఈ చట్టానికి మద్దతు ఇచ్చారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రతిపాదించిన కొత్త చట్టం ప్రకారం అధికారిక సమాచార మార్పిడిలో ఇంగ్లీష్, ఇతర విదేశీ పదాలను ఉపయోగించడం నిషేధం. ఒకవేళ వినియోగిస్తే వారికి 100,000 యూరోల (రూ.82,46,550) వరకు జరిమానా విధించబడుతుంది. దిగువ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ సభ్యుడు ఫాబియో రాంపెల్లి ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ చట్టం ద్వారా అన్ని విదేశీ భాషలు చేర్చబడినప్పటికీ ప్రధానంగా “ఆంగ్లోమానియా” లేదా ఇంగ్లీష్(english) పదాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముసాయిదా ప్రధాన ఉద్దేశం ఇటాలియన్ భాష ప్రాధాన్యాన్ని పెంచడమేనని వెల్లడించింది.
ఈ బిల్లు ప్రకారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పదవిని కలిగి ఉన్న ఎవరైనా కూడా “వ్రాతపూర్వక, మౌఖిక జ్ఞానం, ఇటాలియన్ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఇది అధికారిక పత్రాలలో స్థానిక వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఎక్రోనింస్, పేర్లను కూడా ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో విదేశీ కంపెనీలకు అన్ని అంతర్గత విధానాలు, ఉపాధి ఒప్పందాల కోసం ఇటాలియన్-భాష వెర్షన్లు అవసరం కానున్నాయి.
తమ భాషను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటలీ దేశ ప్రతినిధులు చెబుతున్నారు. ఆంగ్ల భాష మొత్తం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ చట్టం ప్రకారం ఇటాలియన్ మాట్లాడని విదేశీయులతో కూడా కమ్యూనికేట్ చేసే అన్ని కార్యాలయాల్లో ఇటాలియన్ ప్రాథమిక భాషగా ఉండాలి. దీంతోపాటు జాతీయ భూభాగంలో ప్రజా వస్తువులు, సేవల వినియోగం కోసం ఇటాలియన్ తప్పనిసరి చేయబడింది.