ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. మరి భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
Passport: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ దేశాలకు ప్రపంచంలోని 194 దేశాలకు వెళ్లేందుకు వీసా ఫ్రీ సౌకర్యం ఉంది. యూఎస్ పాస్పోర్టుతో 188 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ సౌకర్యం ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డేటా ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ ర్యాంకులను వెల్లడించింది. ఈ ర్యాంకుల జాబితాలో భారత్ 80వ స్థానంలో ఉంది. భారతదేశం నుంచి 62 దేశాలకు వెళ్లేందుకు వీసా ఫ్రీ సౌకర్యం ఉంది. మన పొరుగుదేశాలైన చైనా 62 స్థానంలో ఉండగా.. పాకిస్థాన్ ఏకంగా 101 స్థానంలో ఉంది. పాక్ పాస్పోర్టుతో కేవలం 32 దేశాలకు మాత్రమే వీసాఫ్రీ అరైవల్ సౌకర్యం ఉంది.
మయన్మార్ 92వ స్థానంలో, బంగ్లాదేశ్ 97వ స్థానంలో, శ్రీలంక 96వ స్థానంలో ఉంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం 2006లో భారత్ 71వ స్థానంలో ఉండేది. ఈ సారి జాబితాలో అఫ్గానిస్థాన్ చివరి స్థానం(104)లో నిలిచింది. ఆ దేశ పాస్పోర్టుతో 28 దేశాలు తిరగవచ్చు. దీని కంటే మూడు స్థానలు మెరుగ్గా 101వ ర్యాంక్‌లో పాక్ పాస్‌పోర్ట్ ఉంది. ఇంతకు ముందు యూఏఈ పాస్‌పోర్ట్ 55 నుంచి 11వ స్థానానికి చేరింది. ఉక్రెయిన్, చైనా 21 స్థానాలు మెరుగుపర్చుకున్నాయి. చైనా తాజాగా 62వ, ఉక్రెయిన్ పాస్‌పోర్టు 32వ స్థానంలో నిలిచింది. రష్యా పదేళ్లలో 24 స్థానాలు ఎగబాకి ఈసారి 51వ ర్యాంకుకు చేరింది. ఆ దేశ పాస్పోర్టుతో 119 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లవచ్చు.