CM Jagan: పవన్‌లా 4 పెళ్లిళ్లు చేసుకోలేం.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేం
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా సీఎం జగన్ విమర్శలు చేశారు. టీడీపీ అంటే దోచుకో పంచుకో తినుకో అని చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేశారని తెలిపారు.
CM Jagan: వైసీపీ పునాది సామాజిక న్యాయం మీద ఆవిర్భవించిందని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. కురుపాం మండలంలో జరిగిన అమ్మ ఒడి ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. పేదరికంతో ఏ చిన్నారి చదువుకు దూరం కాకూడదు అనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. స్థానిక నేత అడిగిన రిజర్వాయర్, ఇతర పనుల నిర్మాణాలకు సీఎం జగన్ అంగీకరించారు. టీడీపీ అంటే తినుకో దోచుకో పంచుకో అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు.
ఊగిపోతూ మాట్లాడతాడు..
దత్తపుత్రుడిలాగా బూతులు తిట్టంలే అని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. చెప్పుతో కొడతా అంటాడు.. తాట తీస్తా అంటాడని తెలిపారు. గుడ్డ లూడదీసి తంతా అని అంటారని తెలిపారు. ప్యాకేజీ స్టార్ ఇప్పుడు ఓ లారీ ఎక్కాడు అని విమర్శించారు. దత్తపుత్రుడి నోటికి అడ్డూ అదుపు లేదు, నిలకడ లేదన్నారు. అతను మాములుగా మాట్లాడడు.. ఊగిపోతూ ఉంటాడని గుర్తుచేశారు. వారిలా రౌడీల్లా మీసాలు మేలేయం లే, తోడ గొట్టలేం, బూతులు తిట్టలేం, నలుగురు నలుగురిని పెళ్లి చేసుకోలేం, నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకురాలేం.. ఇవన్నీ పవన్ కల్యాణ్‌కే పేటెంట్ అన్నారు. చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేశాడని జగన్ విమర్శించారు. చిన్న పిల్లలు, అవ్వ, తాతలను, అమ్మ, నాన్నలు కూడా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మంచి చేయొద్దనే 4 కోతులు ఉన్నాయని మండిపడ్డారు.
పొత్తుల కోసం పాకులాడలేదు
‘తాము ఏ నాడు అధర్మాన్ని ఆశ్రయించలేదు, అనైతిక పనులు చేయలేదు. అధికారం కోసం వెంపర్లాడలేదు. పొత్తుల కోసం పాకులాడలేదన్నారు. పేదవాడు బాగుండాలని మాత్రమే అనుకున్నానని.. ఇదీ మన పునాది, మన పార్టీ.. మన మనస్సున్న ప్రభుత్వం అని తెలియజేశారు. చేసిన మంచే తమ బలం అని.. తమ నినాదం అని’ జగన్ పిలుపునిచ్చారు. ‘తాను రాక్షసులతో యుద్దం చేస్తున్నానని జగన్ వివరించారు. అధర్మాన్ని ధర్మంగా ఎంచుకున్న వారితో యుద్ధం చేస్తున్నానని వివరించారు. ఏ మీడియా లేదని, ఓ దత్తపుత్రుడు కూడా తోడుగా లేడని పేర్కొన్నారు. ఓ అబద్దాన్ని వందసార్లు చెప్పి.. అదే నిజం అని చెప్పే మీడియా మాధ్యమాలు లేవన్నారు. మీ బిడ్డ తోడేళ్లను నమ్ముకోలేదని.. పైన దేవుడిని.. కింద జనాలను మాత్రమే అని’ జగన్ స్పష్టంచేశారు. ‘మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనే అంశాన్ని కొలమానంగా తీసుకోవాలని జగన్ (CM Jagan) కోరారు. జరిగే కురుక్షేత్రంలో మీ బిడ్డకు అండగా ఉండాలి అని’ కోరారు.