చివరి నిమిషంలో వేములవాడ (Vemulawada) అభ్యర్థిని మార్చినట్లు కనీసం సమాచారం ఇవ్వకపోవడం దారుణమని బీజేపీ సీనియర్ నేత తుల ఉమ (Tula uma) అన్నారు. బీజేపీలో బీసీ, మహిళ నినాదం బోగస్ అని దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు నాకు టికెట్ నిరాకరించారని ఆమె విమర్శించారు.ఈ నియోజకవర్గానికి తొలుత తుల ఉమ పేరును ప్రకటించారు. కానీ ఈ రోజు బీ ఫామ్ మాత్రం వికాస్ రావుకు ఇచ్చారు. దీంతో ఆమె కంటతడి పెట్టారు. తాను ఉద్యమంలో పని చేశానని, ప్రజాస్వామ్యబద్దమైన పరిపాలన కోసం కొట్లాడానని, అలాంటి తనకు టిక్కెట్ రాలేదన్నారు. తాను దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశానన్నారు.డబ్బుల సంచులు పట్టుకొచ్చిన వారికి, పెద్దవారికి టిక్కెట్ ఇస్తున్నారన్నారు.
సామాన్యులకు, గెలిచే తమలాంటి వారికి టిక్కెట్ నిరాకరించారన్నారు. అభ్యర్థిని మార్చిన అంశంపై కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. తన పేరును ప్రకటించారని, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా తనకు ఫోన్ చేసి మీరు గెలుస్తారు బాగా పని చేయండని చెప్పారని గుర్తు చేసుకున్నారు. కానీ బీఫామ్ వేరేవారికి ఇచ్చారన్నారు. వేములవాడ బరిలో కచ్చితంగా ఉంటానని ఆమె అన్నారు.మరోవైపు బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే ( Rajeshwar Rao Des Pande) నిరసనకు దిగారు. నిన్న విడుదలైన బీజేపీ అభ్యర్థుల చివరి జాబితాలో సంగారెడ్డి నుంచి రాజేశ్వర్ రావు దేశ్ పాండేకు బీజేపీ (BJP) అధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే టికెట్ ఇచ్చినప్పటికీ బీ ఫామ్ ఇవ్వకపోవడంతో దేశ్ పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి మరీ వెక్కి వెక్కి ఏడ్చారు. తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ నేత హెచ్చరించారు.