Nominations : తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. 3 గంటల తర్వాత లైన్లో ఉన్నవారికి మాత్రం నామినేషన్లు వేసే అవకాశం కల్పించింది
తెలంగాణ (Telangana) శాసన సభ ఎన్నికల నామినేషన్లకు గడువు ప్రకియ ముగిసింది.ఈ నెల 13 వరుకు నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు 15 వరుకు అవకాశం ఉంది. పలు పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చడం.. చివరి నిమిషంలో టిక్కెట్లు కేటాయించిన కారణంగా కొంతమంది హడావుడిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ వేయడానికి గడువు ఇచ్చారు. మూడు గంటల లోగా నామినేషన్ వేసేందుకు సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లి వరుసలో నిలుచున్న అభ్యర్థులకు నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చారు.
నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో ఆయా పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ప్రాథమికంగా సీఈఓ (CEO) కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రనికి నామినేషన్ల సంఖ్య 3,114కు చేరుకున్నది. చివరి గంటలో భారీ సంఖ్యలో చాలా సెగ్మెంట్లలో ఫైల్ అయినందున ఈ సంఖ్య మరింత పెరగనున్నది. గత అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) (2018) సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,399 నామినేషన్లు దాఖలు కాగా అందులో 456 రిజెక్ట్ అయ్యాయి. మరో 367 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత వీరిలో 1,569 మందికి డిపాజిట్లు కూడా రాలేదు.