ఉగ్రవాద లింక్ కేసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాదు(Hyderabad)లో సోమవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్ట(Chandrayanagutta)లోని బాబా నగర్ నుండి ఏటీఎస్ – కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఇటీవలే ఆరుగురిని అరెస్ట్ చేయగా, భోపాల్(Bhopal)లో 11 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా నేడు మరో ఇద్దరి అరెస్ట్‌తో ఈ సంఖ్య 19కి చేరుకుంది. ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తహరీర్ (Hizb ut Tahrir) తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచి భోపాల్ కు తరలించారు.
భోపాల్ టెర్రర్ లింక్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాద సంస్థ ‘హిజ్బ్ ఉత్ తహ్రీర్’ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మతమార్పిడులకు ప్లాన్ చేసినట్లు ఎటీఎస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. డార్క్‌వెబ్,కీ ఆఫ్ రైట్ పాత్ పేరుతో యూట్యూబ్ ఛానల్, తీమ్రా,రాకెట్ చాట్ యాప్స్‌తో యువతను ట్రాప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మత మార్పిడులకే మహ్మద్ సలీం (Muhammad Salim) అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య మాడ్యూల్ ఏర్పాటు చేశారు. ఈ మాడ్యూల్తో దేశవ్యాప్తంగా మెట్రో నగరాల యువతను టార్గెట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న యువతను ఆకర్షించేలా ప్లాన్ చేశారు. కీ ఆఫ్ రైట్ పాత్ పేరిట ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసి అందులో ప్రసంగాలు పెట్టి షేర్ చేసేవారు.