»Tollywood Celebrities Finally Came To Minister Komatireddy
Telangana: ఎట్టకేలకు మంత్రి కోమటిరెడ్డి వద్దకు టాలీవుడ్ ప్రముఖులు
తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నేడు సినీ ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి చర్చించారు. ఆ సమస్యలను పరిష్కరిస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈమధ్యనే బాధ్యతలు స్వీకరించిన ఆయన్ని పలువురు టాలీవుడ్ పెద్దలు కలిశారు. లోటస్ పాండ్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కోమటిరెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు రాఘవేందర్ రావుతో పాటుగా పలువురు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మంత్రిని కలిసి పలువ విషయాల గురించి చర్చించారు.
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. కాగా సినిమాటోగ్రఫీ మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించాక టాలీవుడ్ ప్రముఖులు ఎవ్వరూ తనను కలవలేదని, ఎవ్వరి నుంచి అభినందనలు అందలేదని మంత్రి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేవలం దిల్ రాజ్ మాత్రమే పదవి చేపట్టిన తనను కలిసి అభినందించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీరంగ పెద్దలు మంత్రితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.