»Telangana Sister And Brother Get Together After Watching Balagam Movie In Wanaparthy
‘బలగం’ సినిమాతో 15 ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా తమ్ముడు
ఇద్దరు కలుసుకుని ఏడ్చారు. కాగా అక్కాతమ్ముళ్లు కలవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇలాంటి మార్పులు తీసుకువస్తున్న ‘బలగం’ సినిమా బృందానికి అందరూ అభినందిస్తున్నారు.
సినిమా (Cinema) అనేది వినోదం కాదు. ప్రజలను ఆలోచింపజేసేదని ‘బలగం’ సినిమాతో (Balagam Movie) మరోసారి రుజువవుతోంది. కుటుంబ అనుబంధాల ఇతివృత్తంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. పల్లె పల్లెన ఈ సినిమా ప్రదర్శన జరుగుతూ సరికొత్త సంస్కృతిని తీసుకువచ్చింది. ఈ సినిమాను చూసి విడిపోయిన కుటుంబాలు (Families) కలిసిపోతున్నాయి. కొన్ని రోజుల కిందట పొలం పంచాయితీతో దూరమైన అన్నదమ్ములు కలువగా.. వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఉమ్మడి కుటుంబం ఒక్కటి చేరింది. ఇలా జరిగాయి. తాజాగా బలగం మరో బంధం కలిపింది. ఫొటో తీయలేదని అలిగి వెళ్లిన అక్కా బలగం సినిమా చూసి తమ్ముడి దగ్గరికి చేరింది. ఈ సంఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో (Warangal District) జరిగింది.
వరంగల్ మండలం వనపర్తి (Wanaparthy) గ్రామానికి చెందిన అనుముల లింగారెడ్డి, లక్ష్మీ అక్కా తమ్ముళ్లు. లక్ష్మీని అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఈ ఇరు కుటుంబాలు వనపర్తిలో నివసిస్తున్నాయి. అయితే 15 ఏళ్ల కిందట లింగారెడ్డి కూతురు రజని వివాహం జరిగింది. ఆ పెళ్లిలో తనకు ఫొటో తీయకపోవడంతో లక్ష్మి అలిగింది. భోజనం చేయకుండా పెళ్లి నుంచి వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి ఆమె తమ్ముడికి దూరమైపోయింది. ఎంతలా అంటే లక్ష్మి భర్త చనిపోయినా తమ్ముడు లింగారెడ్డి రాలేదు.. అనారోగ్యంతో తమ్ముడు లింగారెడ్డి ఆస్పత్రిలో చేరినా కూడా అక్క లక్ష్మి పరామర్శించలేదు. అంతలా ఈ అక్కాతమ్ముళ్లు దూరమైపోయారు.
ఇటీవల వనపర్తిలో సర్పంచ్ ఉంగరాల శ్రీధర్ (Ungarala Sreedhar) గ్రామస్తుల కోసం ‘బలగం’ సినిమాను పంచాయతీ కార్యాలయం బహిరంగంగా ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన లక్ష్మి, లింగారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. సినిమాలో మాదిరి ఒక చిన్న సంఘటనతో విడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పంతాలు వదిలేసి సర్పంచ్ శ్రీధర్ సమక్షంలో ఈనెల 15న శనివారం లింగారెడ్డి తన అక్క ఇంటికి వెళ్లాడు. ఇద్దరు కలుసుకుని ఏడ్చారు. కాగా అక్కాతమ్ముళ్లు కలవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇలాంటి మార్పులు తీసుకువస్తున్న ‘బలగం’ సినిమా బృందానికి అందరూ అభినందిస్తున్నారు.