తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వాదోపవాదాలు నెలకొన్నాయి. తాజాగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన సభలో కాంగ్రెస్ పార్టీకి తాము ట్రైలర్ మాత్రమే చూపించామని, ఇక సినిమాను చూపిస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ..తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ అంశాల్లో తమ పార్టీ భారీ అవినీతి చేసినట్లు కాంగ్రెస్ నేతలు అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొద్దని అన్నారు. ఇకపై కాంగ్రెస్ నేతలకు సినిమా చూపిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాలను తిప్పికొడతామని, వారు ఎన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ పార్టీని ఏం చేయలేందని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. అదేవిధంగా తమపై అక్రమ కేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతలపై ఎటువంటి అక్రమ కేసులు పెట్టినా తమని తాము కాపాడుకోవడానికి లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని గుర్తు చేశారు.