తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియ ఉదయం మొదలు కాగా..పలు చోట్లు ఈవీఎంలు మొరాయించగా..ఇంకొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే రాష్ట్రంలోని ఐటీ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారని టీటా అధ్యక్షుడు ప్రకటించారు. ఆ వివిరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు తెలంగాణ(telangana) అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) ఓ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) పరిశ్రమలోని ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. TITA అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలో తమ అసోసియేషన్ ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి నిబద్ధతను పాటిస్తుందని, ఓటుహక్కు వినియోగించుకుంటామని తెలిపారు.
అయితే హైదారాబాద్లో ప్రత్యక్ష ఐటీ ఉద్యోగులు 10 లక్షల మంది ఉండగా..వారిలో 62.5% మంది ఓటింగ్ హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక పరోక్ష IT సపోర్ట్ స్టాఫ్ (గృహ సంరక్షణ, భద్రత, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, రవాణా సిబ్బంది, హెచ్ఆర్, పేరోల్ సహ పలువురు ఉద్యోగులు) 32.5 లక్షలు ఉన్నారు. వీరిలో దాదాపు 69.8% మంది ఓటింగ్ హక్కును కలిగి ఉన్నారు. ఐటీపై ఆధారపడిన పరోక్ష ఓటర్లు 22,68,500 మంది ఉండగా..ఇక మొత్త ఐటీ పరిశ్రమ ఓటర్ల ఉమ్మడి బలం 28,93,500 ఓటర్లకు చేరుకుంది.
ఇప్పటికే IT పరిశ్రమలో అధిక ఓటింగ్ కోసం TITA విస్తృతమైన ఓటింగ్ అవగాహన ప్రచారాలు నిర్వహించింది. లాంగ్ వీకెండ్ కారణంగా ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం వంటి అపోహలను తొలగించేందుకు శ్రద్ధగా పనిచేసింది. TITA ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల తగ్గిన ఓటింగ్ పుకార్లను తోసిపుచ్చారు. ఊహాగానాలకు విరుద్ధంగా IT సంఘం పోలింగ్ రోజున అద్భుతమైన ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉందన్నారు. నవంబర్ 30న ఇప్పటికే అమలులో ఉన్న క్రమబద్ధీకరించబడిన వర్క్ ఫ్రమ్-హోమ్ ఆప్షన్ల ద్వారా అధిక ఓటు భాగస్వామ్యాన్ని తాము ఆశిస్తున్నామని టీటా అధ్యక్షుడు వెల్లడించారు.