»Telangana Doctor License Cancelled After Blunder Surgery Done On Wrong Leg
Doctor License Cancel వైద్యుడి నిర్వాకం.. ఒక కాలికి బదులు మరో కాలికి ఆపరేషన్
రెండు రోజుల తర్వాత బాధితుడు ఎడమ కాలికి సమస్య ఉంటే కుడి కాలికి చికిత్స చేశారు ఏంటనే సందేహం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని అడగా పొరపాటును గుర్తించాడు. ఒక కాలికి చేయబోయి మరో కాలికి శస్త్ర చికిత్స చేసినట్లు గమనించారు.
వైద్య వృత్తి ఎంతో పవిత్రమైన బాధ్యతగా భావించాలి. అందుకే వైద్యుడిని (Doctor) దేవుడిగా కొలుస్తారు. అలాంటి వైద్యుల్లో కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటారు. విధుల పట్ల నిర్లక్ష్యం (Neglegence) వహిస్తారు. దీని కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితి ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉంటుంది. తాజాగా ఓ వైద్యుడు విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం చేసి ఫలితంగా తన డాక్టర్ లైసెన్స్ ను రద్దు చేసుకునే (Doctor License cancelled) దాక పరిస్థితి చేరింది. ఒక కాలికి శస్త్ర చికిత్స చేయాల్సిందిపోయి మరో కాలికి చేశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ (Hyderabad)లోని ఈసీఐఎల్ (ECIL) ప్రాంతానికి చెందిన వైద్యుడు ఎం.పాటిల్. ఆర్థోపెడిషియన్ (Orthopedician)గా ఓ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా నిత్యం రోగులతో బిజీబిజీగా ఉంటాడు. అలా ఒక రోజు ఓ రోగి వచ్చాడు. అతడి ఎడమ కాలికి (Left Leg) ఏదో కావడంతో శస్త్ర చికిత్స చేస్తే నయమవుతుందని నిర్ణయించాడు. ఇక శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు జరిగాయి. రోగిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి విజయవంతంగా శస్త్ర చికిత్స (Surgery) చేశాడు.
అయితే రెండు రోజుల తర్వాత బాధితుడు ఎడమ కాలికి సమస్య ఉంటే కుడి కాలికి (Right Leg) చికిత్స చేశారు ఏంటనే సందేహం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని అడగా పొరపాటును గుర్తించాడు. ఒక కాలికి చేయబోయి మరో కాలికి శస్త్ర చికిత్స చేసినట్లు గుర్తించి రెండు రోజుల తర్వాత ఎడమ కాలికి శస్త్ర చికిత్స అయ్యింది. వైద్యుడి నిర్వాకాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడు. డీఎంహెచ్ ఓకు (DMHO) ఫిర్యాదు చేయడంతో ఆ వైద్యుడు చేసిన తప్పిదంపై అధికారులు విచారణ చేశారు. వైద్యుడు పాటిల్ తప్పు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (Telangana State Medical Council- TSMC) చైర్మన్ రాజలింగం అతడిపై చర్యలు తీసుకున్నారు. 6 నెలల పాటు అతడిని డాక్టర్ గా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక మరో ఘటనలో మంచిర్యాల జిల్లా వైద్యుడు శ్రీకాంత్ ను 3 నెలల పాటు డాక్టర్ లైసెన్స్ ను రద్దు చేశారు. ఆరోగ్యం విషమంగా ఉన్న వ్యక్తిని హైదరాబాద్ కు, లేదా పెద్ద ఆస్పత్రికి రిఫర్ చేయకపోవడం అతడు చేసిన తప్పు. దాని ఫలితంగా ఓ వ్యక్తి ప్రాణం పోయింది.