పాకిస్తాన్ కరాచీ(Karachi)లో ఇబ్రహీమ్ హైదరి అనే మత్స్యకారుడు ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. అతను ఇటీవల అరేబియా సముద్రంలో వేటకు వెళ్లగా, అత్యంత అరుదైన గోల్డెన్ ఫిష్ (Sowa)లు చిక్కాయి. వీటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ చేపలలో ఉండే దారం లాంటి పదార్థాన్ని సర్జరీ(Surgery)లలో ఉపయోగిస్తారు. దీంతో 20-40 కేజీల బరువుండే ఒక్కో చేప వేలంలో ఏకంగా రూ.70 లక్షలకు అమ్ముడుపోయింది. మొత్తం చేపలకు దాదాపు రూ.7 కోట్లను అతను సంపాదించాడు.దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. గరిష్ఠంగా ఓ చేప రూ.1 కోటి (పాకిస్థాన్ రూపాయలు)కి అమ్ముడైనట్లు పాకిస్థాన్ ఫిషర్మెన్ ఫోర్ అధ్యక్షుడు ముబారక్ ఖాన్ తెలిపారు.
సోవా చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. వాటి పొట్ట నుంచి సేకరించిన స్రావాలు ఔషధ గుణాల(Medicinal properties)ను కలిగి ఉంటాయి. వీటిని మెడిసిన్ (Medicine) తయారీలో ఉపయోగిస్తారు. ఈ చేపల నుంచి తీసిన సన్నటి దారం లాంటి పదార్థాన్ని శస్త్రచికిత్సలో వినియోగిస్తారు. అందువల్ల వీటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ రకం చేపలు 20 నుంచి 40 కేజీల బరువు, 1.5 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. తూర్పు ఆసియా దేశాల్లో వీటిని మంచి గిరాకీ ఉంటుంది. స్థానిక వంటకాల్లోనూ వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా ఇవి సముద్రం లోపల ఉంటాయి. గుడ్లు పెట్టే సమయంలోనే తీరానికి వస్తుంటాయి.