Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్సకు సర్జరీ..నిలకడగా ఆరోగ్యం
ఏపీ మంత్రి బొత్సకు బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో నెల రోజుల పాటు బొత్స సత్యనారాయణను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకు సర్జరీ జరిగింది. శనివారం ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 6వ తేది శృంగవరపు కోటలో వైసీపీ బస్సు యాత్ర నిర్వహించింది. ఆ యాత్రలో మంత్రి బొత్స పాల్గొన్నారు. యాత్ర సమయంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని హుటాహుటిన విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆస్పత్రిలో బొత్స సత్యనారాయణను పరీక్షించిన వైద్యులు గుండెకు మూడు చోట్ల పూడికలు ఉన్నట్లుగా గుర్తించి వెంటనే ఆపరేషన్ చేయాలని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు బైపాస్ సర్జరీని పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ వైద్యుల పర్యవేక్షణలో ఆపరేషన్ జరిగింది.
బొత్సకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. నెల రోజుల వరకూ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో కుటుంబీకులు ఆయనే వద్దే ఉంటూ బాగోగులు చూసుకుంటున్నారు. విశ్రాంతి వల్ల ఆయన కొన్ని రోజుల పాటు తన విధులకు దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే పలు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.