తెలంగాణలో (Telangana) అకాల వర్షాలు (Untimely Rain) కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన గాలులు మొదట ప్రారంభమై అనంతరం వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల వడగండ్లు, పిడుగులతో వర్షం కురిసింది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఈ వర్షానికి పలుచోట్ల చెట్లు కూలిపోగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో ఆయా చోట్ల ధాన్యం వర్షానికి తడిసిపోయింది. దీంతో రైతులు (Farmers) దిగాలు చెందుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad)లో భారీ వర్షం పడింది. గురువారం అర్ధరాత్రి మొదలుకుని తెల్లవారుజాము 7 గంటల వరకు అడపదడపగా వర్షం పడింది. తెల్లవారుజాము 5.30 నుంచి 7 గంటల వరకు భారీగా వర్షం కురిసింది. నల్లకుంట, తార్నాక, విద్యానగర్, హుస్సేన్ సాగర్, నాంపల్లి, బంజారాహిల్స్, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వాన పడింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ వర్షాలతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు. వారం రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఎండలకు తాళలేకపోయారు. అకాల వర్షాలతో ఎండ వేడిమి నుంచి ప్రజలు తాత్కాలిక ఊరట లభించింది. సాయంత్రం వరకు ఇదే ముసురు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ (Telangana Meteorological Department) తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.
కాగా ఈ వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు కోతకు వచ్చిన దశలో వానలతో పంట నష్టపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోత పూర్తి చేసుకుని విక్రయానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలు వర్షాలకు తడిసిపోతున్నాయి. మామిడి రైతులకు (Mango Farmers) అకాల వర్షాలు శాపంగా మారాయి. గాలిదుమారం, వర్షాలకు కాత దశలో ఉన్న కాయలు నేల రాలుతున్నాయి. ఈసారి కాత బాగా రావడంతో ఆనందంలో ఉన్న రైతులను అకాల వర్షాలు ముంచుతున్నాయి. కాయలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.