»Telangana Congress Leaders Signature On The Bond Paper Presence Of God
Congress leaders: 6 హామీలు అమలు చేస్తామని దేవుడి సమక్షంలో బాండ్ పేపర్ పై సంతకం
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బాండ్ పేపర్లపై సంతకాలు చేశారు. అయితే కొందరు అభ్యర్థులు దేవాలయాలకు వెళ్లి పూర్తి చిత్తశుద్ధితో అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేయడం ప్రస్తుతం ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
telangana congress leaders Signature on the bond paper presence of God
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులకు దీటుగా నువ్వా నేనా అన్నట్లుగా ప్రజల్లోకి వెళుతున్నారు. కౌంటర్లకు తగ్గేదేలే అంటూ స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క(mallu bhatti vikramarka) దేవుడి సమక్షంలో బాండ్ పేపర్ పై సంతకం చేసి..కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలను అమలు చేస్తామని సంతకం చేశారు.
అంతేకాదు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ(congress party) అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. దీంతోపాటు అందరికీ న్యాయం చేస్తానని, అన్ని ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని, సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తానని అన్నారు. దీంతోపాటు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని బాండ్ పేపర్ పై రాసి సంతకం చేశారు. నోటి మాట ద్వారా చెప్పెది నిజం కాదన్నారు. కానీ ఇప్పుడు అఫిడవిట్ రూపంలో హామీ ఇస్తున్నట్లు సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
మరోవైపు ఇంద్రవెల్లి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్ కూడా నాగోబా దేవుడి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలను(6 guarantees) అమలు చేస్తామని బాండ్ పేపర్ పై సంతకం చేశారు. పేపర్ పై సంతకం చేసి ఆలయ మెస్రం పీఠాధిపతులకు అందజేశారు. అవినీతికి పాల్పడకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ క్రమంలో బాండ్లపై సంతకం చేసిన అభ్యర్థుల్లో టి.జీవన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వేముల వీరేశం, గండ్ర సత్యనారాయణరావు, జి. మధుసూధన్ రెడ్డి, కె.కె. మహేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జి. వినోద్, నారాయణరావు పాటిల్ తదితరులున్నారు. అయితే ఈనెల 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు వారి హామీల గురించి బలంగా ప్రకటన చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.