»Postal Parcel Service Postal Department Launched Door Step Service
Postal Parcel Service: డోర్ స్టెప్ సర్వీస్ ప్రారంభించిన పోస్టల్ డిపార్ట్మెంట్
హైదరాబాద్ నగర వినియోగదారులు ఇప్పుడు వారి లెటర్లతో పాటు పార్శిళ్లను వారి ఇంటి వద్ద నుంచి సేకరించేలా స్పీడ్ పోస్ట్ సర్వీస్‌ను తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది.
ప్రైవేట్ కొరియర్ సంస్థలతో ఇండియా పోస్ట్స్ పోటీపడుతోంది. ఇప్పుడంతా ప్రైవేట్ కొరియర్ సంస్థలు కస్టమర్ల ఇళ్ల వద్దకే సర్వీస్ ఇచ్చేలా పార్సిల్ పికప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ విధంగా ప్రజలకు ఆ కొరియర్ సేవలు దగ్గరయ్యాయి. అదే విధంగానే ఇప్పుడు ఇండియా పోస్ట్స్ డోర్‌స్టెప్ పికప్ సర్వీసులను ప్రారంభించింది. ఆ సేవలను విస్తరించే క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఆ సేవలను అందించనుంది.
ఇకపై హైదరాబాద్‌లోని కస్టమర్లు తమ పార్శిళ్లను బుక్ చేసుకోవడానికి పోస్టాఫీసు వద్ద పెద్ద క్యూలో ఉండాల్సిన పనిలేదు. హైదరాబాద్ నగర వినియోగదారులు ఇప్పుడు వారి లెటర్లతో పాటు పార్శిళ్లను వారి ఇంటి వద్ద నుంచి సేకరించేలా స్పీడ్ పోస్ట్ సర్వీస్‌ను తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. ఈ సర్వీస్ ఏకంగా 107 పిన్కోడ్లలో అందుబాటులో వచ్చింది. యూజర్లు ఇకపై వారి ఇళ్ల నుండే రిజిస్టర్డ్ లెటర్లను క్లిక్ అండ్ బుక్ సర్వీస్ ద్వారా పంపొచ్చని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒకసారి గరిష్టంగా 5 కిలోల బరువుతో ఐదు పార్సిళ్లను బుక్ చేసుకోవచ్చు.
టారిఫ్ 500 కంటే ఎక్కువ ఉంటే ఉచిత పికప్ ఉంటుంది. అయితే బుకింగ్ ఛార్జీ 500 కంటే తక్కువ ఉంటే 50 రూపాయలను వసూలు చేయనున్నట్లు తెలంగాణ పోస్టల్ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ వెల్లడించారు. సేవలు పొందేందుకు కస్టమర్లు పోస్టల్ శాఖ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం, స్థానిక, గెజిటెడ్ సెలవులు మినహా అదే రోజు లేదా ఆ తర్వాతి వర్కింగ్ రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కస్టమర్లు పికప్ కోసం స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.