SRPT: నడిగూడెం మండలం ఫారెస్ట్ పరిధిలో గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నడిగూడెం, మునగాల మండలాలకు చెందిన భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
VKB: చంద్రగ్రహణం నేపథ్యంలో ధారూర్ మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. గ్రహణ సమయంలో ఆలయాల్లో నిత్య పూజలు నిలిపివేయడం ఆనవాయితీ అని, అందుకే ముందస్తుగా ద్వారాలు మూసివేసినట్లు ఆలయ పూజారి కుమారస్వామి తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం బుధవారం తెల్లవారుజామున ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12-12-2018న జరిగిన హత్య కేసులో నిందితుడు రామాపురం మల్లేశ్వర్ రావుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. మృతుడు రామావత్ బాల (35)ను అక్రమ సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. శాస్త్రీయ ఆధారాలు, డీఎన్‌ఏ నివేదికలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు శిక్ష విధించినట్లు SP శరత్ చంద్ర పవార్ తెలిపారు.
HYD: హోలీ వేళ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరే వలల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ప్రజలను హెచ్చరించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే ఉచిత బహుమతులు, భారీ డిస్కౌంట్ల వంటి నకిలీ లింకులు, ప్రమాదకరమైన (APK) ఫైళ్లను క్లిక్ చేయవద్దని పేర్కొన్నారు. అలా చేస్తే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు.
JNG: సింగరాజుపల్లి టోల్ గేట్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బియ్యం లోడుతో ఉన్న బొలెరో ట్రాలీ ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. దీంతో బొలెరో ట్రాలీ నడిరోడ్డుపై రోడ్డుకు అడ్డంగా పల్టీ కొట్టి తలక్రిందులుగా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలవగా.. స్థానికులు వారిని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
SRPT: నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ వెంకటరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచించారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటానన్నారు.
NGKL: జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌కు 1,772 హెచ్‌పీవీ టీకా డోసులు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా, సివిల్ ఆసుపత్రుల్లో ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంగళవారం DMHO డాక్టర్ రవికుమార్ నాయక్ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
MHBD: ఇనుగుర్తి గ్రామంలో ఎంజాల కుమారస్వామి అనే రైతు తమ సాగు చేస్తున్న కూరగాయల పంటలో కూరగాయలు తెంపుతుండగా, బీరకాయ సాగులో వినూత్నంగా రామచిలుక ఆకారంలో బీరకాయ కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. జెన్యూ మార్పిడి వల్ల కొన్ని సార్లు విత్తనాలు, చిన్న మార్పులు వస్తాయని పలువురు రైతులు పేర్కొన్నారు.
MLG: ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా మంగపేట మండలం మల్లూరులో గల స్వయంభు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం స్వామి వారికి ఆరాధన, నివేదన చేసి (ద్వారా బంధనం) ఆలయ తలుపులు మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రెవెల్లి మహేష్ తెలిపారు. బుధవారం దేవాలయ సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అరణ్య ప్రాంతాల మార్గంలో ప్రయాణం చేస్తుంటే జింకల గుంపులు ప్రత్యక్షమై చెంగుచెంగున ఎగురుతూ వెళ్లేవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా జింకలు కనిపించడం లేదు. పోడు సాగు, చెట్ల నరికివేత, గుట్టలు పిండి చేయడంతో అడవుల విస్తీర్ణం తగ్గిపోయి అవి దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయి స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని వన్యప్రాణి ప్రేమికులు పరిశోధించారు.
WGL: సంగెం (M) కేంద్రంలోని కాపుల కాన్పర్తి గ్రామంలో 16 నూతన సీసీ కెమెరాలను ఏసీపీ వెంకటేష్ ఇవాళ ప్రారంభించారు. గ్రామంలో భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను అరికట్టడం, ప్రజలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దొంగతనాలు నియంత్రణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం రంగుల కేళితో పులకించిపోయింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో మహిళా ఎస్సైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజే పాటల హోరులో ఎస్పీతో కలిసి మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా స్టెప్పులేశారు. సంప్రదాయ పద్ధతిలో రంగులు పూసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
PDPL: పెద్దపల్లి సర్కిల్లో విద్యుత్ లేని 69 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ లేని కేంద్రాలను గుర్తించి, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలతో పాటు విద్యుత్ సేవలను వేగంగా అందిస్తున్నామన్నారు.
SRPT: అధికారుల వేధింపులు భరించలేక తెల్లబల్లి ప్యాక్స్ (PACS) ఇన్‌ఛార్జి సీఈవో రాజారావు సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రుణ వసూళ్లు, ప్యాక్స్ నిర్వహణపై ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇవాళ తెలిపారు. ప్రస్తుతం రాజారావు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
BDK: పర్యావరణానికి హాని చేయని సాధారణ రంగులనే వాడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సూచించారు. భద్రాద్రి జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. మంగళవారం మణుగూరు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొని, నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగులు చల్లుకున్నారు.