NRML: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో మార్చి 8న ఆరు రోజుల పుణ్యక్షేత్ర యాత్ర నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ పండరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూరి జగన్నాథ దేవాలయం సహా పలు క్షేత్రాలు సందర్శనకు గాను పోను–రాను కలిపి ఒక్కొక్కరికి రూ. 6400గా నిర్ణయించారు. నమోదు కోసం నిర్మల్ బస్టాండ్‌లో సంప్రదించాలన్నారు.
WGL: గీసుగొండ మండలంలోని కొమ్మాల జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల వ్యాపారులకు నీడ కష్టాలు వెంటాడుతున్నాయి. ఎండలు పెరగడంతో దుకాణాల ఎదుట వ్యాపారులు నీడ కోసం షేడ్ నెట్లను ఏర్పాటు చేశారు. అయితే వాటితో రహదారి ఇరుకుగా మారుతుందని గతంలో వాటిని పోలీసులు తొలగించారు. కాగా, ఎండ వేడితో దుకాణాలకు భక్తులు ఎవరూ రావడం లేదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని TSWRS పాఠశాలలో వైద్యాధికారులు డాక్టర్ నరేందర్, పూజ, సిబ్బంది విద్యార్థులకు సీపీఆర్‌పై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్పృహ తప్పి కూలిపోయిన వ్యక్తిని చూసిన వెంటనే 108కి సమాచారం ఇవ్వాలన్నారు. స్పందన ఉందో లేదో పలకరించి చూడాలని, స్పందన లేకపోతే నాడి పరిశీలించి, శ్వాసకు ఆటంకం ఉంటే గాలి మార్గం సులభం చేయాలన్నారు.
KMR: బాన్సువాడలోని పలు గ్రామాల్లో హోలీ వేడుకల సందర్భంగా నిర్వహించిన ‘జడకొప్పు’ కోలాటం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామ చావిడిల వద్ద యువకులు ఉత్సాహంగా ఈ కోలాటం ఆడారు. ఏటా ఆనవాయితీగా హోలీ రోజున జడకొప్పు వేసి, తిరిగి ఉగాది పండుగ నాడు కోలాటం ఆడుతూ దీనిని విప్పుతారని గ్రామ పెద్దలు తెలిపారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా పల్లెల్లో పండుగ వాతావరణం ఏర్పడింది.
NZB: నందిపేట్ మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ రావుపై జిల్లా సీపీకి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో అతనిపై దొంగనోట్లు, ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయని సీపీ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.
SRD: సదాశివపేట మండలంలోని పలు గ్రామాల్లో రబ్బి సాగు కోతలు ముగిసినా, ఐకేపీ (IKP) కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనగ కుప్పలు సిద్ధంగా ఉన్నప్పటికీ విక్రయాలు జరగక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
GDWL: కేటీదొడ్డి మండలం ఇరికిచెడు సబ్‌స్టేషన్‌కు నూతన ఆపరేటర్గా బాధ్యతలు స్వీకరించిన పీ.వెంకట్ రెడ్డిని గ్రామ ప్రజలు మంగళవారం సన్మానించి, స్వాగతం పలికారు. నూతన ఆపరేటర్ గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ లక్ష్మయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
SRPT: హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇవాళ జర్నలిస్టులు హోలీ వేడుకలను అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. నిరంతరం వార్తా సేకరణలో నిమగ్నమయ్యే జర్నలిస్టులు, వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి రంగుల పండుగలో మునిగితేలారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ సోదరభావాన్ని చాటారు.
SDPT: తెలంగాణలో జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఇటీవల రాహుల్ బొజ్జా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన పూల మొక్కను అందజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ బొజ్జాకు మంత్రి అభినందనలు తెలిపారు.
MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో నిర్వహించనున్న రేణుక ఎల్లమ్మ తల్లి 12వ వార్షికోత్సవ వేడుకలకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్లో ఆలయ ధర్మకర్త, కాంగ్రెస్ నాయకులు ర్యాకల కృష్ణ గౌడ్, బైరి ప్రశాంత్ గౌడ్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో వర్గాల మధ్య అపోహలు, ఉద్రిక్తతలు కలిగించేలా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్ షేర్ చేయడం చట్టపరమైన చర్యలకు గురవుతుందని జిల్లా ఎస్పీ డీ. జానకి తెలిపారు. నిర్ధారించని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అసత్య ప్రచారం గమనించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
NGKL: కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో చేపడుతున్న పాటు కాలువల పూడికతీత పనులను మంగళవారం ఏపీవో నాగరాజు పరిశీలించారు. గ్రామంలోని పని ప్రదేశానికి సందర్శించి కూలీలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కేవైసీ ఆధార్ ఫోటో క్యాప్చర్ విధానాన్ని పరిశీలించి కూలీలకు అవగాహన కల్పించారు.
MNCL: బెల్లంపల్లి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను 14వ వార్డు కౌన్సిలర్ ఆసాది మధు ఆధ్వర్యంలో మంగళవారం సత్కరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కారించమన్నారు. ఈ సందర్భంగా ఆసాది మధు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న వారిని అభినందించారు.
NRML: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోలీ పండగ ప్రజలందరి జీవితాల్లో రంగులు నింపాలని కోరారు. ప్రజలు పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వారు సూచించారు.
WGL: 20వ డివిజన్ కాశిబుగ్గ శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో మంగళవారం శ్రీ రామా సత్య నారాయణస్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హోలీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకను వైభవోపేతంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు వంగరి రవి మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.