JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు 9 గ్రామాల్లోని 94 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ఉంటాయని, ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు 10 గ్రామాల్లోని 93 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
KMM: హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సదస్సులో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని సీఎం సూచించారు. ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానించాలని, మధ్యాహ్న భోజన బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు.
SRPT: మోతే మండలం విభళ్లపురం, అప్పన్నగూడెం గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యతలేని నిర్మాణంతో ఇళ్లలో చీలికలు ఏర్పడగా, కరెంట్, త్రాగునీరు వంటి వసతులు లేవని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. వర్షాల సమయంలో బురద, దోమలు, పాముల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి వసతులు ఏర్పాటు చేయాలన్నారు.
WNP: ఘనపూర్‌లోని శ్రీ బజారు ఆంజనేయస్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ ఆధ్వర్యంలో 76వ పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు చాలీసా పారాయణం నిర్వహించారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
ASF:కెరమేరి మండలం పెద్దబండ అటవీ ప్రాంతంలోని భీమన్నగుడి,నీటి కుంటల వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ డ్రైవ్ నిర్వహించారు. FDO అప్పయ్య మాట్లాడుతూ.. భక్తులు ప్లాస్టిక్ వ్యర్ధాలను అడవిలో పారేయకుండా వెంట తీసుకెళ్లాలని సూచించారు. వంటలు చేసుకున్న వారు మంటలను పూర్తిగా ఆర్పివేయాలని, లేనిపక్షంలో అగ్నిప్రమాదాల వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు.
PDPL: ధర్మారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఇవాళ ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రంగుల హోలీ సందర్భంగా అందరి జీవితాలు రంగులమయం కావాలని ఆకాంక్షించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు తేడా లేకుండా వేడుకలో పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.
BHNG: చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు (కవాటబంధనం). రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం వంటి శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు. భక్తులు ఈ విజ్ఞప్తిని గమనించాలని ఆయన కోరారు.
SRD: హైదరాబాద్‌లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీకు చెందిన ఎం. అనూష ఫార్మాస్యూటికల్ పరిశోధనలో పీహెచ్‌డీ పొందారు. బయోలాజికల్ మ్యాట్రిక్స్‌లో ఔషధాల అంచనాకు LC-MS/MS పద్ధతుల అభివృద్ధిపై పరిశోధన చేశారు. మానవ ప్లాస్మాలో అస్కిమినిబ్, ఫ్రక్విన్టినిబ్, లుర్బినెక్టెడిన్‌లను ఖచ్చితంగా కొలిచే విధానాలను ఆమె రూపొందించారు.
MBNR: బాలానగర్ మండలంలోని మోతీ ఘనపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ యాదవ్ మొదటి వార్డు సభ్యుడుగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మంగళవారం ప్రవీణ్ యాదవ్‌ను మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా హైదరాబాదులోని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగృహంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
RR: ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ పాఠశాలను నడిపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిపాల్ అన్నారు. చేవెళ్ల నగర కేంద్రంలో హోలీ పండుగ సందర్భంగా ఇవాళ అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే ఓ స్కూలు మాత్రం పాఠశాలను నడిపిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలను బంద్ చేయించి, విద్యార్థులను ఒత్తిడికి గురి చేసే పాఠశాలపై చర్యలు తీసుకోవాలన్నారు.
VKB: పులుమద్ది గ్రామంలో హోలీ వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గ్రామస్థులందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ బోయిని శ్వేత శివయ్య, ఉప సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ టి.మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు.
RR: సినీనటుడు శివాజీరాజా తండ్రి జి.రామరాజు(85) మంగళవారం అనారోగ్య సమస్యతో మధురానగర్‌లోని నివాసంలో కన్నుమూశారు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. శివాజీరాజా తండ్రి మరణవార్త తెలుసుకొని చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
BDK: ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమ భూములను అటవీశాఖ అధికారులు అన్యాయంగా లాక్కుంటున్నారని ఆదివాసీ గిరిజనులు ఆరోపించారు. పట్టాలు ఉన్న భూములను స్వాధీనం చేసుకుని, కేవలం రెండెకరాలు మాత్రమే ఇస్తామనడం సరికాదని ధ్వజమెత్తారు. తమ భూమి తమకు కావాలని కోరినందుకు అధికారులు దాడులకు తెగబడ్డారని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
NZB: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు అందించారు.
WNP: జనసేన పట్టణ, మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈనెల 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, కార్యకర్తలకు భరోసా కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని పార్లమెంట్ కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. జనసైనికులందరూ వాలంటీర్ల ద్వారా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని ఆయన సూచించారు.