WGL: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ నేడు మంత్రి కొండా సురేఖను కలిశారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే మహిళలకు పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణకు మంత్రి సురేఖ సూచించారు.
WNP: వనపర్తిలో పీజీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పీజీలో 350 విద్యార్థులకు వసతి గృహాల కొరకు రూ.1కోటి 50 లక్షలు మంజూరు చేయించడం జరిగింది అని తెలిపారు.
WGL: పర్వతగిరి మండలంలో “పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ మహా అభియాన్” మండల స్థాయి శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ మాట్లాడుతూ… రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని. బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
JN: జనగామ-సిద్దిపేట, జనగామ-సూర్యాపేట ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిలపై సెంటర్ డివైడర్లను ఏర్పాటు చేయాలని BSP జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… డివైడర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
MLG: సహజ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని వెంకటాపురం మండలం మండల వ్యవసాయ అధికారి నవీన్ అన్నారు. బుధవారం మండలంలోని రాచపల్లి వ్యవసాయ క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని వారు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గి నాణ్యమైన దిగుబడులు వస్తాయన్నారు. రైతులు మొగ్గు చూపాలన్నారు.
BDK: ఏళ్ల తరబడి సేవలు అందించి పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన అంగన్వాడీ రిటైర్డ్ టీచర్లు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు.
SRCL: ఎల్లారెడ్డిపేట సర్కిల్ నూతన ఇన్స్‌పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఓ. వెంకటేశ్ ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి, పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నూతన సీఐకి శుభాకాంక్షలు తెలియజేశారు.
MNCL: ఈనెల 14న నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులు ఎలాంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ ఎస్ఆర్ఆర్ గార్డెన్‌లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, పెన్సిల్స్ అందించారు.
HYD: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన FIH హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 పూల్-B మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు ఉరుగ్వేపై 3-1 తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ తరఫున జెన్నిఫర్ ఈడీ (10′) ఒక గోల్ చేయగా, కేథరిన్ హోల్డ్ గేట్ (43′, 58′) రెండు గోల్స్ చేసింది. ఉరుగ్వే తరఫున తెరిసా వియాన (18′) ఒక్క గోల్ నమోదు చేసింది.
KNR: ఇల్లందకుంట మండల ప్రజలు రాత్రిపూట ఇళ్ల తలుపులు, కిటికీలు బాగా లాక్ చేసుకోవాలని ఇల్లందకుంట SI క్రాంతి కుమార్ సూచించారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో అంతరాష్ట్ర దొంగలు ఒకే రోజు 9 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
NLG: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డీఈవో బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,147(బాలురు), 9,551(బాలికలు), 137(ప్రైవేటు) ఉన్నట్లు వివరించారు.
JN: జనగామ పట్టణ కేంద్రంలో యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో “అమ్మ పేరుతో ఒక మొక్క” (Ek Ped Maa Ke Naam) కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. యువ భారత్ వరంగల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. గ్రామ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
NGKL: ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం ‘నో స్మోకింగ్ డే’ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధూమపానం వల్ల కలిగే అనర్థాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మదన్ మోహన్ మాట్లాడుతూ.. ధూమపానం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, యువత వీటికి దూరంగా ఉండాలన్నారు.
WGL: ఖానాపురం మండలంలోని పెద్ధమ్మగడ్డ స్మశానవాటిక రోడ్డు ప్రక్కనే ఉండడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని మనుబోతులగడ్డ గ్రామస్థులు తహాసీల్థార్ రమేష్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. రోడ్డు పక్కన స్మశాన వాటిక ఉండడం వల్ల నిత్యం రాత్రి పగలనక వెళ్ళే మనుబోతులగడ్డ, బండమీదిమామిడి తండా, ఆయకట్టు రైతులకు భయానక వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
KMM: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. జ్యోతి తెలిపారు. కల్లు గీత కార్మిక సహకార సంఘాలు, ఎక్సైజ్ శాఖలో నమోదై, నీరా సేకరణ, విక్రయ అనుమతి కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 18లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.