RR: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మజీద్ మామిడిపల్లి గ్రామంలో శివలింగం అనే వ్యక్తికి మంజూరైన రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బుధవారం ఎమ్మెల్సీ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర వైద్య సహాయార్థం సీఎంఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలన్నారు.
NLG: నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘మీల్స్ ఆన్ వీల్స్’ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా, వినాయక చవితి పండుగ రోజున రోగుల సహాయకులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆహార స్టాల్ నిర్వాహకుల సహకారంతో పౌష్టికాహారం (చద్దన్నం) పంపిణీ చేశారు.
NGKL: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి సీపీఐ,సీపీఎం పార్టీలు మద్దతు తెలిపినట్లు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. బుధవారం ఢిల్లీలోని అజయ్ భవన్, సుర్జిత్ భవన్‌లలో సీపీఐ,సీపీఎం జనరల్ సెక్రెటరీలను ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కలిసి ఎంపీ మల్లురవి కలిశారు. మద్దతు తెలపడం పట్ల ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
VKB: భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ ప్రసాద్ కుమార్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సోషల్ మీడియా వేదికగా సందేశం విడుదల చేశారు.
GDWL: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని బుధవారం పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు.
KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైరా నియోజకవర్గ BRS నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు. బుధవారం ఏన్కూరు మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కేసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు.. అటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
KNR: గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. వినాయక చవితి పర్వదినం కావడంతో వినాయకులను ప్రతిష్ఠించడనికి వాన అడ్డంకిగా మారింది. ఇప్పటికే నిండిన చెరువులు మత్తడి దూకుతున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోనున్నాయి.
MBNR: మహబూబ్‌నగర్ గ్రీన్స్ , సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక, సమావేశం బుధవారం ఏర్పాటైంది. నూతన అధ్యక్షులుగా గుబ్బ అశోక్ కుమార్, ఉపాధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి రాగిరి తిరుపతయ్య, కోశాధికారి వినోద్ కుమార్ 9 మంది సభ్యులును నియమించారు. ఈ సంఘానికి ఎన్నికల అధికారులుగా కుమారస్వామి, సురేష్ కుమార్ నేతృత్వం వహించారు. సంగం బలోపేతానికి కృషి చేయాలి.
BDK: ములకలపల్లి మండలం జగన్నాధపురం నుంచి దమ్మపేట వెళ్లే రోడ్డు మార్గం గుంతల మయంగా మారింది. పాత గంగారం వద్ద రోడ్డు గుంతలు పడి అత్యంత ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిలిచి ప్రమాదాలకు దారితీస్తుందని స్థానికులు వాపోతున్నారు. గుంతలు పడిన రోడ్లకు శాశ్వత మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
NZB: భారీ వర్షాలు కురుస్తున్నందున శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతం, నదులు, వాగులు, జలాశయాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్షాలతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. కాలువలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లవద్దన్నారు.
SRCL: గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో బుధవారం సాయంత్రం పశువులను తీసుకురావడానికి వెళ్లి ప్రవీణ్ అనే రైతు మానేరు వాగులో చిక్కుకుపోయారు. విషయాన్ని గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో సహాయక చర్యల కోసం మరో ఎస్‌డీ ఆర్ఎఫ్ బృందంను జిల్లా అధికారులు పంపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఆరుగురు వరదలో చిక్కుకున్నారు.
BDK: మణుగూరులోని పలు గణేష్ మండపాలను విద్యుత్ శాఖ ఏఈ ఉమా రావు బుధవారం తనిఖీ చేశారు. విద్యుత్ సిబ్బందికి భద్రతపై పలు జాగ్రత్తలు సూచనలు చేశారు. తనిఖీలో భాగంగా అతుకులు ఉన్న సర్వీస్ వైర్లను, ఎంసీబీ లేకుండా విద్యుత్‌ను వాడుకుంటున్న, సిల్క్ వైర్లతోని పోల్ మీద కొండీలు ఉన్న సర్వీస్ వైర్లను తొలగించినారు.
MDK: మెదక్ పట్టణ శివారులోని పుష్పాల వాగు ఒడ్డున గల విద్యుత్ సబ్ స్టేషన్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటిలో మునిగిపోయింది. విద్యుత్ సబ్ స్టేషన్ నీటిలో మునిగి, కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు తెలిపారు.
NLG: న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. కూకట్‌పల్లిలో న్యాయవాది శ్రీకాంత్‌పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న్యాయవాద వృత్తి భవిష్యత్తులో దినదిన గండంగా మారనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.