SRPT: సూర్యాపేట జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వినాయక నవరాత్రుల నేపథ్యంలో పువ్వుల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రతి వాడలను గణనాథుడిని ప్రతిష్టించి కొలుస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పూజ కోసం ప్రధానంగా పూలు, పండ్లు ఉపయోగిస్తారు. రెండు రోజుల కిందటితో పోలిస్తే పూల ధరలు భారీగా పెరిగాయని నిర్వాహకులు తెలిపారు.
SRCL: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజలెవరూ వాగులు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లొద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరంలో అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
ASF: జైనూర్ మండలంతో పాటు పట్నాపూర్, గూడా మామడ, తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు వాగులు, వంకల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
BDK: భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో 28 గురువారం చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల్లో జరగాల్సిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు వాయిదా వేయడం జరిగింది. కావున సీపీఐ, మిత్రపక్షాల నాయకులు, మీడియా సోదరులు, అధికారులు గమనించాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ కోరారు.
HYD: తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశం గురువారం ఉదయం 10.30గంటలకు జరగనుంది. CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన బంజారాహిల్స్‌లోని లీలా హోటల్లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 2036లో ఒలింపిక్స్ నిర్వహణ లక్ష్యంగా ఈ భేటీని నిర్వహించనున్నారు. క్రీడలు, మౌలిక సదుపాయాలు, యంగ్ ఇండియా, క్రీడా అభివృద్ధి నిధిపై CM రేవంత్ చర్చించనున్నారు.
JGL: మేడిపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సోమిడి మహేందర్ ఆధ్వర్యంలో BAMCEF 12వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల 31న కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరగబోయే ఈ మహాసభలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దయ్య రఘువీర్, BYM రాష్ట్ర అధ్యక్షులు అగ్గిమల్ల రఘు, చిట్యాల అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.
KNR: ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాల కార్యదర్శులను భారీగా బదిలీ చేశారు. మొత్తం 125 సంఘాల్లో 94 మంది కార్యదర్శులను మారుస్తూ సహకార శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేచోట ఎక్కువ కాలం పనిచేయడం వల్ల నిధుల దుర్వినియోగం, అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. KNR-25, JGTL-37, PDPL-18, SRCL జిల్లాలో 14మంది బదిలీ అయ్యారు.
WGL: వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం దుగ్గొండి సీఐ సాయిరమణ తెలిపారు. దుగ్గొండి సర్కిల్ పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపూర్ మండలాల ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు వర్షాల సమయంలో వ్యవసాయ పనులు, చేపలు పట్టడం, పశువులను తీసుకొని వాగులు దాటవద్దని, సురక్షితంగా ఉండాలని కోరారు.
MHBD: గార్ల మండలంలోని పాకాల చెక్ డ్యాంపై వస్తున్న వరద ఉధృతిని DSP తిరుపతిరావు బుధవారం పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదలు తగ్గే వరకు ఏటి పరిసరాలకు, చెక్ డ్యాం పైకి ఎవరు వెళ్ళవద్దని, సెల్ఫీలు దిగవద్దని ప్రజలను కోరారు. రాకపోకలను నియంత్రించాలని పోలీసులకు ఆదేశించారు.
WNP: రేవల్లి మండల ప్రజలు వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిన్న ఎస్సై రజిత సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, విద్యుత్ స్తంభాలు, పరికరాలకు దూరంగా ఉండాలని తెలిపారు. రైతులు వ్యవసాయ బావుల వద్ద మోటార్ల విషయంలో జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. వర్షాల వల్ల వాగులు, చెరువులు, కుంటలు నిండినందున ఈతకు, చేపలు పట్టడానికి వెళ్లడం మానుకోవాలని ప్రజలను కోరారు.
ADB: జిల్లా కేంద్రంలోని ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రతిష్టించిన గణనాథునికి బుధవారం రాత్రి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా SP అఖిల్ మహాజన్ వినాయకునికి తొలి పూజలు నిర్వహించారు. గణపతి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. అదనపు ఎస్పీ సురేందర్ రావు, శ్రీనివాస్, ఇంద్ర వర్ధన్, తదితరులున్నారు.
NZB: ధర్పల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో లక్ష్మారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, ఎంపీవో రాజేశ్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు విద్యుత్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు.
HYD: స్థానిక సంస్థ ఎన్నికలు, నగరంలో ఉపఎన్నిక, రానున్న GHMC ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు గణపతి ఉత్సవాలు వేదికయ్యాయని గ్రామాల్లో, నగరంలో యువకులు అంటున్నారు. వీరికి దగ్గరయ్యేందుకు యువజన సంఘాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత ఖర్చైనా చేసేందుకు నేతన్నలు పోటీ పడుతున్నారు.
MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్థానిక ఎస్సై అనూష సూచించారు. గురువారం ఉదయం ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఆరు గంటలుగా భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు వరద ఉధృతితో ప్రవహిస్తున్నాయని వెల్లడించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని ఆమె కోరారు.
VKB: బంట్వారం మండలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో గుంపులుగా సంచరిస్తున్న వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి పెద్దగా అరుస్తూ, ప్రజల నిద్రకు భంగం కలిగిస్తున్నాయి. రోడ్ల వెంట వెళ్లేవారు ఈ కుక్కల గుంపులను చూసి ఎప్పుడు దాడి చేస్తాయోనని భయపడుతున్నారు. ఈ వీధి కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.