KMR: విద్యార్థులు కంటి సమస్యలు రాకుండా పౌష్టికాహారమైన చేపలు గుడ్డు తినాలని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. రాజంపేటలోని ZPHS గుండారం పాఠశాలలో నేడు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్ స్క్రీన్ ప్రభావం వల్ల చూపు మందగించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.
RR: చేవెళ్ల మండల పరిధి గొల్లగూడ గ్రామంలోని 2వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. HMDA నిధులు రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ నిర్మల నర్సింహులు ప్రారంభించారు. దశలవారీగా వార్డులో అభివృద్ధి పనులు చేపడతామని సర్పంచ్ తెలపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఇవాళ ఉదయం ఓ విద్యుత్ స్తంభంపై వానరం కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కాసేపు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. స్తంభంపై విగతజీవిగా పడి ఉన్న వానరాన్ని చూసి కాలనీ వాసులు, బాటసారులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు తక్షణమే స్తంభంపై ఉన్న వానరాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
WGL: హోళీ పండుగ సందర్భంగా సహజసిద్ధ రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనిక రంగులు వాడకూడదని వరంగల్ CP సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
NZB: బోధన్ రూరల్ మండలం అమ్దాపూర్‌లో సోమవారం హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామస్థులంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. అంతకుముందు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా కామదహనం నిర్వహించారు. సర్పంచ్ గంగాధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉట్టి వేడుకలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య అనే రైతు కార్యాలయం ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMR: శాసనసభ సభాపతి పదవికి దుద్దిళ్ల శ్రీపాదరావు వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్‌లో యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు ఉన్నారు
MDK: తూప్రాన్ పశు వైద్యశాలలో చికిత్స పొందుతూ జింక మృతి చెందినట్లు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద అటవీ నుంచి బయటకు వచ్చిన జింకపై ఊర కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గ్రామస్తులు రక్షించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, తూప్రాన్ ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.
PDPL: మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన ధన్వాడలో పుట్టి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగడన్నారు
KMR: బిక్కనూర్ మండల పరిధిలో నూతనంగా మంజూరు చేసిన పరిశ్రమల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని పెద్ద మల్లారెడ్డి సర్పంచ్ సాయ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పరిశ్రమల స్థాపనతో పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
KMR: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్‌పేట జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం ఎస్సై భార్గవ్ గౌడ్ సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల వస్తువుల భద్రతకు సరైన సౌకర్యం లేకపోవడాన్ని గమనించి, పోలీసు భద్రతా సిబ్బంది వద్దే వస్తువుల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.
MBNR: ఉమ్మడి జిల్లాలో సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త కలెక్టర్లు అడుగులు వేయబోతున్నారా? అన్న చర్చ మొదలైంది. జిల్లాలో అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న అక్రమ వ్యాపారాలపై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో జిల్లాకు వచ్చిన ముగ్గురు కొత్త కలెక్టర్లు ఈ గంభీరమైన సమస్యపై ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
BDK: సమాజంలో సంబంధంలేని రోగాలు వస్తున్న సందర్భంగా ప్రజలు రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం వైద్య అధికారి పి. రవితేజ అన్నారు. సోమవారం సమత్ మోతె పంచాయితి గొల్లగూడెం పాఠశాలలో టీబీ, ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోగాల పట్ల ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దని అన్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు
హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం (ఐడీఓసీ)లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. విభిన్న శాఖలకు చెందిన అధికారులు హాజరై వినతులను పరిశీలిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
NRPT: మక్తల్ 16వ వార్డు మినీ గ్రౌండ్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఒక కార్యక్రమం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దీన్ని వారం రోజులు అయిన తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కనీసం కంచె లేదా హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వార్డు ప్రజలు అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.