Maharashtra : బీఆర్ఎస్ పార్టీకి మరాఠాలు గట్టి షాక్
బీఆర్ఎస్ (BRS) పార్టీకి తెలంగాణ సరిహద్దున ఉన్న పొరుగు రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లోనే గట్టి ఎదురుదెబ్బ తగలడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ (Telangana) ఫార్ములా మహారాష్ట్ర రైతులను ఆకర్షిస్తుందని ఆశించిన అధికార రాష్ట్ర సమితి పార్టీకి సీఎం కేసీఆర్ కు ఈ ఫలితాలు తీవ్రమైన నిరాశను మిగిల్చాయి
దేశంలో పాగావేస్తామంటూ తొలి అడుగుగా మహారాష్ట్ర (Maharashtra) కు వెళ్లిన ముఖ్యమంత్రికి కేసీఆర్ కు మరాఠాలు గట్టి షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ (TRS) కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మారి జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు ఆ పార్టీకి ఘోర పరాజయాన్ని మిగిల్చారు. మొత్తం 18 మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులకు హోరాహోరీగా సాగిన పోటీలో ఒక్కటంటే ఒక్కటి సీటు దక్కకుండా మరాఠా రైతులు తీర్పు చెప్పారు. కచ్చితంగా ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయనుకొని ఎన్నికల బరిలోకి దిగిన రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గంలోనే ఫలితాలు అధికార పార్టీని నిరాశపరిచాయి.
తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని నిర్మల్ (Nirmal) జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని బోకర్ తాలూకా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS)మద్దతుదారులు ఒక్క డైరెక్టర్ పదవిని కూడా దక్కించుకోలేకపోయారు. శుక్రవారం జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల తమ మద్దతుదారులను అభ్యర్థులుగా బరిలో నిలిపాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శనివారం జరిగింది.18 మంది డైరెక్టర్ల పోస్టులకు గాను కాంగ్రెస్ (Congress) మద్దతుదారులు 15 మంది, బీజేపీ మద్దతుదారులు ముగ్గురు గెలుపొందగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయింది