దేశాని ఇందిరాగాంధీ చేసిన సంక్షేమం ఏం లేదన్న కేసీఆర్ మాటలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు. మోదీ, కేసీఆర్ ఒకటేనని అన్నారు.
Mallikarjuna Kharge is sad that KCR is also insulting Indira Gandhi
Mallikarjuna Kharge: తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ సందర్భంగా ఇందిరాగాంధీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే(Mallikarjuna Kharge) తప్పుబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఖర్గే నల్గొండ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కటేనని విమర్శించారు. వారిద్దరికీ పేదల కష్టాలు, కన్నీళ్లు కనిపించవు అని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీని కేసీఆర్ తిట్టడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఏం చేయలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తరపున తాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ను నిర్మించకుంటే తెలంగాణ ఎలా ఉండేది అని ప్రశ్నించారు.
దేశానికి హరిత విప్లవం, శ్వేత విప్లవాలు రెండు పెను మార్పును తీసుకొచ్చాయని, వాటి వలనే దేశం సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. నిరుపేదలను ఆదుకోవడంలో ఇందిరాగాంధీ ఎప్పుడూ ముందుండేవారని వెల్లడించారు. ఆహార కొరతను తీర్చడానికి ఆమె ఎంత సేవ చేసిందో కేసీఆర్కు తెలియదా అని, అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. రైతులకు, పేదలకు, దళితులకు న్యాయం చేయడమే ఇందిరమ్మ రాజ్యం అన్నారు. గాంధీ కుటుంబం ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికపై కుట్ర చేశారని మల్లికార్జున ఖర్గే తెలిపారు.