CM KCR: రేవంత్ రెడ్డి ఓ భూకబ్జాదారు..చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు: కేసీఆర్
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. చిప్పకూడు తిన్న వ్యక్తి సీఎం కాలేడంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజా ఆశీర్వాద సభలో కోరారు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఓ భూకబ్జాదారు అని, చిప్పకూడు తిన్నా కూడా సిగ్గురాలేదని సీఎం కేసీఆర్ (CM KCR) విమర్శించారు. బుధవారం ఆయన కొడంగల్ (Kodangal)లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirwada Sabha)లో ప్రసంగించారు. సభలో ఆయన మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నట్లు ఆ పార్టీ నేతలే చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదన్నారు.
ఎమ్మెల్యేలను కొనేందుకు వెళ్లి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని, ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో 15 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని , రేవంత్ రెడ్డి చచ్చినా ముఖ్యమంత్రి కాలేడని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రేవంత్‌కు ఓ నీతి, పద్ధతి లేదన్నారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలీదని, ఆయనొక భూకబ్జాదారు అని ఆరోపణలు చేశారు. ఎక్కడబడితే అక్కడ భూములను రేవంత్ రెడ్డి కబ్జా చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మళ్లీ ప్రజలంతా పేదరికంలోనే బతకాలని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) విజయం సాధిస్తుందన్నారు. కొడంగల్ నుంచి గతంలో చాలా మంది వలసలు వెళ్లారని, బతుకుదెరువు కోసం కుటుంబాలను వదిలి వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వలసలు లేవన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి (Dharani)ని రద్దు చేస్తారని, ధరణి స్థానంలో భూమాతను తెస్తున్నట్లు కాంగ్రెస్ చెబుతోందని, అది భూమేత అని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు.