Kadiyam Srihari: స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభ్యత మరిచి, తల్లులను అవమానానికి గురిచేస్తున్నాడని మండిపడ్డారు. కడియం శ్రీహరి కులం ప్రస్తావించి.. ఆయన తల్లి పేరును తీయడంతో ఈ మేరకు రియాక్ట్ అయ్యారు. కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఎస్సీ కాదని రాజయ్య అన్నారు. అతని తల్లి పద్మశాలీ.. బీసీ అని గుర్తుచేశారు. బీసీల ఇంట్లో పుట్టి, పెరిగి.. బైండ్ల ఇంటికి వచ్చాడని గుర్తుచేశారు. తల్లి బీసీ అని.. తండ్రి దళిత అనేది ఊహా అని పేర్కొన్నారు. గత 60 ఏళ్ల నుంచి అతను రిజర్వేషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. చదువుకునే సమయంలో.. రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ వాడుకున్నారని వివరించారు. తనకు శ్రీహరిపై వ్యక్తిగతంగా కోపం లేదని చెబుతున్నారు. దళిత జాతికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. దళిత దొరలా కడియం శ్రీహరి (Kadiyam Srihari) వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం
రాజయ్య కామెంట్స్‌పై కడియం శ్రీహరి (Kadiyam Srihari) విరుచుకుపడ్డారు. తన తల్లి బీసీ అని అంగీకరించారు. తన తండ్రి బైండ్ల అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తాను దళితుడిని అవుతానని తెలిపారు. తన బిడ్డ కూడా దళిత కమ్యూనిటీ అని.. మతాంతర వివాహం చేసుకుంటే ఆ మతం, లేదంటే కులానికి చెందినవారు అవుతారని తెలిపారు. రాజయ్యకు న్యాయ సూత్రాలు తెలియవా..? చట్టం చదువుకోలేదా..? లోక పరిజ్ఞానం లేదా అని విరుచుకుపడ్డారు. డాక్టర్ చదివి.. సభ్యత మరిచారని విరుచుకుపడ్డారు. పద్దతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తల్లులను అవమానపరిచే నేత రాజయ్య అని ధ్వజమెత్తారు. తన కుటుంబం, పిల్లలను అవమానానికి గురిచేశాడని తెలిపారు. తన స్థాయి ఏంటో మరచిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
దేవాదుల సృష్టికర్త అంటే కడుపుమంట
ఇటీవల కొన్ని చోట్ల తన ఫోటో పెట్టి దేవాదుల సృష్టికర్త అని ప్లెక్సీలు పెట్టారని కడియం శ్రీహరి (Kadiyam Srihari) వివరించారు. ఆ ఫ్లెక్సీ చూసి రాజయ్యకు కడుపు మండిందని తెలిపారు. అందుకే ఎన్ కౌంటర్ల సృష్టికర్త అని అంటున్నారని వివరించారు. 1994కి మందు రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు జరగలేదా..? 2004 తర్వాత ఎన్ కౌంటర్లు జరగలేదా అని అడిగారు. అంతేకాదు 1994 నుంచి 2004 వరకు అప్పటి ప్రభుత్వంలో తాను భాగస్వామిని అని వివరించారు. తాను సీఎంను కాదు.. హోం మంత్రిని కూడా కాదని చెప్పారు. ఆ సమయంలో ఎన్ కౌంటర్లు జరిగితే తాను బాధ్యుడిని అవుతానా అన్నారు. మరీ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో.. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఎన్ కౌంటర్లు ఎక్కువ జరిగాయని చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి.. ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య.. ఆ ఎన్ కౌంటర్లకు బాధ్యత వహిస్తాడా అని ప్రశ్నించారు. దానికి రాజయ్య బాధ్యత తీసుకుంటే.. తాను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పారు.
దళితబిడ్డలకు రాసిస్తా..
తనకు గుంటూరు, హైదరాబాద్, బెంగళూర్, సింగపూర్, మలేషియాలో ఆస్తులు ఉన్నాయని రాజయ్య అంటున్నారు. అలా ఉన్నట్టు ఆధారాలతో సహా నిరూపిస్తే ఆ ఆస్తులను ఘణపురం దళిత బిడ్డలకు రాసిస్తానని కడియం శ్రీహరి (Kadiyam Srihari) సవాల్ విసిరారు. రేపు లేదంటే.. వారం తర్వాత వచ్చిన సరే అని చెప్పారు. అలా రాకుంటే రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2003లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్ట్, సబ్ స్టేషన్, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, మోడల్ కాలనీ నిర్మించానని గుర్తుచేశారు. ఏ ఊరులో అయినా సరే చర్చకు సిద్దం అని సవాల్ విసిరారు.