»Jana Reddy Statements Congress Alliance With Brs Coming Elections
Telanganaలో సంచలనం.. BRS Partyతో కాంగ్రెస్ పొత్తు?
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. గులాబీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తేలుతోంది. కాగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
తెలంగాణలో (Telangana) రాజకీయాలు (Politics) వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు (Assembly Elections) దాదాపు 8 నెలలు కూడా సమయం లేదు. దీంతో పార్టీలు విజయం కోసం ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ (Bharat Rashtra Samithi- BRS Party) మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. గులాబీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తేలుతోంది. కాగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహం రచిస్తున్నాయి. అయితే అనూహ్యంగా అధికార పార్టీతో కాంగ్రెస్ పార్టీ (Indian National Congress Party-INC) పొత్తు ఏర్పరచుకుంటుందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. దీనికి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి (K Jana Reddy) చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో అవసరమైతే గులాబీ పార్టీతో చేతులు కలిపేందుకు హస్తం పార్టీ సిద్ధంగా ఉందని తెలుస్తున్నది.
రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు విషయమై మాట్లాడేందుకు శుక్రవారం హైదరాబాద్ (Hyderabad)లోని తన నివాసంలో జానారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరాచక పాలన సాగిస్తున్న మోదీపై (Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా 17 పార్టీలు పోరాడుతున్నాయని.. వాటిలో ఒకటి బీఆర్ఎస్ (BRS Party) అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గులాబీ పార్టీతో పొత్తు విషయమై పలువురు ప్రశ్నలు వేయగా.. ‘బీఆర్ఎస్ తో పొత్తు విషయం ఎన్నికలు వచ్చినప్పుడు, తప్పదు అనుకున్న సమయంలో ప్రజలు నిర్ణయిస్తారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం రేపాయి. తెలంగాణ రాజకీయంలో సరికొత్త పొత్తు ఏర్పడనుందని చర్చ సాగింది.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనే వార్తలు వెలువడ్డాయి. గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), తాజాగా జానారెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేయడంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అందరూ నమ్మారు. కాగా తన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో వెంటనే జానారెడ్డి స్పందించారు. ‘బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని నేను ఎక్కడా చెప్పలేదు’ అని స్పష్టం చేశారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా 17 పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయడాన్ని స్వాగతిస్తున్నాని మాత్రమే నేను చెప్పా. బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని ఎక్కడా చెప్పలేదు. పొత్తులు ఏ పార్టీతో ఉండాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయమే మాకు శిరోధార్యం’ అని జానారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా కొన్నాళ్లుగా తెలంగాణలో ఈ పొత్తు వ్యవహారం తీవ్ర చర్చకు వస్తున్నది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ పని చేస్తుందనే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీపై వేటు అంశంపై సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao) స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారు. రాహుల్ పై వేటు, అదానీ కుంభకోణం వ్యవహారంపై కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్వహించిన సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. ఢిల్లీలో రెండు పార్టీలు కలవడంతో తెలంగాణలోనూ కలిసి పని చేస్తాయనే కథనాలు మొదలయ్యాయి.
వీటికి ఆజ్యం పోసేలా ‘అవసరమైతే బీఆర్ఎస్ తో కలుస్తాం’ అని గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తాజాగా జానారెడ్డి కూడా అచ్చం అవే వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే చర్చ మొదలైంది. గతంలో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు కొనసాగింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ జత కట్టవచ్చు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కొంత తగ్గి బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధంగా ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా అదే ఆలోచన చేస్తున్నది. ఒకవేళ ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు కాంగ్రెస్ తో కలిసే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. కాగా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.