తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) ముగిశాయి. దీంతో నేటితో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ (Election commission) వెల్లడించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 9వ తేది నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నేటితో ఆ నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసినట్లు ప్రకటించింది.
తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆ రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కోడ్ (Election code)ను ఎత్తివేస్తున్నట్లు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. దీంతో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తొలగినట్లయింది. దాదాపు రెండు నెలల పాటు ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు 64 స్థానాల్లో గెలుపొందారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎంపిక రేపటికి వాయిదా పడింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, నలుగురు పరిశీలకులు అధిష్ఠానంతో చర్చలు జరిపేందుకు ఢిల్లీకి వెళ్లారు. సోనియాతో ఖర్గే చర్చించి స్వయంగా ఆయనే సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు.