»Barrelakkas Announcement That She Will Contest As An Mp
Barrelakka: ఎంపీగా పోటీ చేస్తానని బర్రెలక్క ప్రకటన
తెలంగాణలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన బర్రెలక్క తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో ఆమెకు 5,598 ఓట్లు వచ్చాయి. నిరుద్యోగులంతా తనకు అండగా నిలిచారని, ప్రజలు తనకు సపోర్ట్‌గా నిలిచారని, వారి కోసం తాను వెనకడుగు వేయనని బర్రెలక్క తెలిపారు. ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేగా ఓడిపోయినంత మాత్రాన తాను వెనకడుగు వేయలేదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీ (MP)గా పోటీ చేస్తానని బర్రెలక్క (Barrelakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల (Telangana Elections)కు ముందు బర్రెలక్కగా ఫేమస్ అయిన శిరీష (Sirisha) ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బరిలోకి దిగి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలిచారు. 28,981 భారీ ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా నిలబడిన బర్రెలక్కకు 5,598 ఓట్లు రాగా ఆమె నాలుగో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి హర్ష వర్ధన్‌కి 62,872 ఓట్లు, జూపల్లికి 91,853 ఓట్లు వచ్చాయి. తన ఓటమిపై బర్రెలక్క భావోద్వేగానికి గురయ్యారు.
ధనబలం ముందు తాను ఓడిపోయినట్లు బర్రెలక్క (Barrelakka) అన్నారు. పుట్టగానే ఎవ్వరూ నడవరని, మెల్లగా నడక నేర్చుకుంటారని, తాను ఈసారి ఓడిపోయినా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని, తనకు ప్రజల మద్దతు ఉందని బర్రెలక్క అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో నిరుద్యోగులంతా తన వైపే ఉన్నారన్నారు. తాను ఓడిపోయినంత మాత్రాన వెనుతిరగను అని, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు.
తనది తొలి అడుగే అయినా అది గట్టిగానే పడిందని, తాను ఎవ్వరికీ బయపడనని తెలిపింది. తాను ఇచ్చిన హామీల కోసం ప్రయత్నిస్తానని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తనకు మద్దతు పలికిన వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో తాను నిరుద్యోగుల కోసం పోరాడుతానని అన్నారు. ఇక్కడ రోడ్ల దుస్థితి బాలేదని, రోడ్ల వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యే (MLA)గా పోటీ చేసి ఓడిపోయిన తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ (MP)గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.