Elections: ఎన్నికల్లో వేసే సిరా ఎలా తయారు చేస్తారు?
ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లకి చేతి వేలిపై బ్లూ ఇంక్ సిరా వేస్తారు. ఈ ఇంక్ అంత తొందరగా చెదిరిపోదు. అసలు దీనిని ఎలా తయారు చేస్తారు? ఎందుకు దీని మరక అంత తొందరగా పోదు? అసలు దీని స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
Elections: దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు దొంగ ఓట్ల వల్ల ఎన్నికల సంఘం చాలా సమస్యలు ఎదుర్కొంది. ఈ దొంగ ఓట్లను కట్టడం చేయడం ఎలా అని ఆలోచిస్తుంటే చేతి వేలిపై చెరిగిపోని సిరా గుర్తు వేయాలనే ఆలోచన వచ్చింది. ఈక్రమంలో బ్లూ ఇంక్ పద్ధతిని తీసుకొచ్చారు. దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చే ఈ పద్ధతిని ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఈ సిరాను 1962 ఎన్నికల్లో తొలిసారిగా ఉపయోగించారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో దీనిని ఉపయోగిస్తున్నారు. ఈసారి ఎలక్షన్లలో 26.55 లక్షల వయల్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆర్డర్ చేసింది. దీనికోసం రూ.55 కోట్లు ఖర్చు చేసింది. వయల్స్ ఒక్కో దాంట్లో 10 మిల్లీ లీటర్ల సిరా ఉంటుంది. ఒక్క సీసాతో దాదాపు 700 మంది ఓటర్ల వేళ్లపై సిరా గుర్తు వేయవచ్చు.
ఈ ఇంక్‌ను భారత ఎన్నికల సంఘం మాత్రమే తయారు చేయిస్తుంది. మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే సంస్థతో చేయిస్తారు. దీని తయారీ ఫార్ములా కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. సంస్థలో పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు మాత్రమే ఈ ఇంక్ తయారీ విధానం తెలుసు. అనుకోని కారణాల్లో మిగతావాళ్లకు తెలియజేస్తారు. ఈ సిరా తయారీకి సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. అందుకే ఈ గుర్తు అంత తొందరగా చెరిగిపోదు. ఈ సిరాను ప్రపంచంలో చాలా దేశాలు వాడుతున్నాయి. కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేషియా, నేపాల్, దక్షిణాఫ్రికాతో పాటు 25కి పైగా దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ సిరాను మన దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నారు.