»Ipl 2023 Gujarat Titans Beat Super Kings Titans Won By 5 Wickets
IPL చాంపియన్ గుజరాత్ శుభారంభం.. గైక్వాడ్ శ్రమ వృథా
IPL ఆరంభం అదిరిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ తొలి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. సీఎస్కే తరఫున రుతురాజ్ గైక్వాడ్ చేసిన భారీ స్కోర్ వృథాగా మారింది. ఐపీఎల్ ఆరంభోత్సవంలో తమన్నా, రష్మిక మందాన్న, అర్జిత్ సింగ్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
క్రికెట్ అభిమానులకు పండగ వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League- IPL) ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించి డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) శుభారంభం చేసింది. 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings- CSK)ను ఓడించింది. రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గర్జన వృథా అయ్యింది. అంతకుముందు ఐపీఎల్ ప్రారంభోత్సవం జోష్ గా సాగింది. హీరోయిన్లు తమన్నా (Tamanna), రష్మిక మందాన్న (Rashmika Mandanna), అర్జిత్ సింగ్ (Arjit Singh) అదిరిపోయే ప్రదర్శనలతో అహ్మదాబాద్ స్టేడియం హోరెత్తింది. చాలా రోజుల తర్వాత ఆ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. అయితే తొలి మ్యాచ్ ఓడిపోవడం సీఎస్కే అభిమానులను నిరాశపర్చింది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్ తో రెచ్చిపోయాడు. 50 బంతుల్లో 92 (4 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసి కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. గైక్వాడ్ తో జతగా ఎవరూ నిలువలేదు. కాన్వే ( ఒక్క పరుగుకే ఔటవగా.. మొయిన్ అలీ (23), శివమ్ దూబే (19) కొంత స్కోర్ పెంచారు. అయితే ఆఖరిలో వచ్చిన ఎంఎస్ ధోనీ తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్ లో ఒక సిక్స్, ఒక ఫోర్ తో చెన్నై అభిమానులను అలరించాడు. రషీద్ ఖాన్ (2/26), షమీ (2/29) అల్జారి జోసెఫ్ (2/33) తమ బౌలింగ్ సీఎస్కేను నియంత్రించారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సునాయస లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్ మన్ గిల్ అర్ధ శతకం (36 బంతుల్లో 63: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) నమోదు చేశాడు. విజయ్ శంకర్ (27) వృద్ధిమాన్ సాహ (25), సాయి సుదర్శన్ (22) తలా కొన్ని పరుగులు చేసి గుజరాత్ కు విజయాన్ని అందించారు. చెన్నై అరంగేట్ర ఆటగాడు రాజ్యవర్ధన్ హంగర్ గేకర్ తన బౌలింగ్ రుచి చూపాడు. మూడు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చినా 3 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.