జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవీకి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందికి గురిచేస్తున్నారని తెలిపారు. మీడియా సమావేశంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బలహీన వర్గానికి చెందిన మహిళను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘సంజయ్ దొర.. మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామా చేస్తున్నాను. మీ గడీల నుంచి బయటకు వస్తున్నా, ఇదిగో నా రాజీనామా పత్రం అని’ అని బోగ శ్రావణి తన రాజీనామా లేఖను మీడియాకు చూపించారు.
శ్రావణితో ఎమ్మెల్యేకు పడటం లేదని తెలిసింది. అవిశ్వాస తీర్మానం పెడతామని శ్రావణే బెదిరించారట. 23 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన లేఖ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం వద్దని హైకమాండ్ స్పష్టంచేసింది. సద్దుమణిగిందని అనుకున్నారు. ఈరోజు అనూహ్యంగా శ్రావణి మీడియా ముందుకు వచ్చారు. రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
మున్సిపల్ చైర్మన్గా మూడేళ్లపాటు పనిచేశానని శ్రావణి తెలిపారు. ఆ సమయంలో తీవ్ర ఇబ్బందులు పెట్టారన్నారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు. భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. తన కుటుంబాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బెదిరించారని తెలిపారు. తన కామెంట్లపై ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. తాను చేసిన వ్యాఖ్యలు అబద్దం అని ఎమ్మెల్యే తన మనమరాలి మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల రాజకీయంగా వేధింపులు మొదలయ్యాయని శ్రావణి తెలిసింది. ఇక నా వల్ల కాదు అని ఆమె పదవీకి రాజీనామా చేశారు. సంజయ్ కుమార్ నేత్ర వైద్య నిపుణుడు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మాజీమంత్రి జీవన్ రెడ్డిని ఓడించారు. నియోజకవర్గంలో మాత్రం అంతగా పట్టులేదని, డెవలప్ చేయడం లేదని స్థానికులు అంటున్నారు. కల్వకుంట్ల కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తానంటే తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని అప్పట్లో సంజయ్ ప్రకటన చేశారు. కేసీఆర్ ఫ్యామిలీకి సంజయ్ కుమార్ బంధువు అవుతారు.