రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉంటామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తాను పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించే వ్యక్తిని కాదని, క్రమశిక్షణ కలిగిన కార్య కర్తనని ఆయన తెలిపారు. పార్టీ కోసం పదేళ్లుగా శ్రమిస్తున్నానని, పదవులు కోరుకోవడంలో తప్పులేదని రఘునందన్ రావు పేర్కొన్నారు.రెండు నెలల్లో బీజేపీ (BJP)ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు. దుబ్బాక (Dabbaka) నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఉప ఎన్నికల్లో తనకు ఎవరూ సాయం చేయలేదని, తాను మాత్రం బీజేపీలోనే ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. మునుగోడు (Munugodu) ఉపఎన్నికల్లో గెలిచేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, గెలవలేదన్నారు. అదే రూ.100 కోట్లు నాకు ఇస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు.
దుబ్బాకలో తనను చూసే గెలిపించారని వ్యాఖ్యానించారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ (Bandi Sanjay) స్థానంలో మరొకరిని నియమిస్తారనడం వాస్తవమే అన్నారు. బండి సంజయ్ ది స్వయంకృతాపరాథమన్నారు. ఆయన పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశారని, అలాంటి వ్యక్తి వందల కోట్ల రూపాయలతో యాడ్స్ ఎలా ఇచ్చారని నిలదీశారు. తరుణ్ చుగ్(Tarun Chugh), సునీల్ బన్సల్ ఫోటోలతో ఓట్లు రావని, రఘునందన్, ఈటల రాజెందర్ (Etala Rajender) బొమ్మలతోనే వస్తాయని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమే అన్నారు. తెలంగాణ శాసన సభలో బీజేపీకి శాసన సభాపక్ష నేత లేడని నడ్డాకు తెలియదని, వారి దృష్టికి తీసుకువెళ్తే అదేమిటని అడిగారు తప్ప తదుపరి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.