Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు.. ఈ పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ ఆయన కరీంనగర్లోని ఇందిరా భవన్లో నిరసన దీక్ష చేపట్టారు. ప్రజల ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని పొన్నం నిలదీశారు. రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకోని బీజేపీ నాయకులు, ఇప్పుడిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అంబానీ, అదానీకి దోచిపెడుతోందని.. తెలంగాణ ఏర్పాటును అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ సర్కారు విభజన హామీలు అమలు చేయలేదు.
వస్త్రాలపై 12 శాతం జీఎస్టీ విధించారు. నా తల్లిని అవమానించేలా ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారు? మోదీ ఏమైనా చేస్తే ఆయన ఫొటోతో ఓట్లు అడగండి.. రాముడి ఫొటోతో కాదు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలి. ప్రకృతి వైపరీత్యాలు, కరవుతో నష్టపోయిన రైతులను కేంద్రం ఎందుకు ఆదుకోవడం లేదు? ఎన్నికలు రాగానే ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ ఈ ఐదేళ్లు ఎక్కడికి పోయారు? అమలు చేయని హామీలపై చర్చకు భాజపా నేతలు సిద్ధమా? రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వడానికి మనసు రాలేదా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.